[1] బంగారం ఎంత కాంతిహీనమైంది! మేలిమి బంగారానికి ఎంత మార్పు కలిగింది! దేవునికి అర్పించిన రత్నాలు ప్రతి వీధి మొగను పారవేయడం జరిగింది.
[2] సీయోను ప్రియ ప్రజలు ఒకప్పుడు మేలిమి బంగారంతో పోల్చతగ్గవారై ఉన్నా, ఇప్పుడు కుమ్మరివాడు చేసిన మట్టి కుండలతో సమానమని ఎంచబడుతున్నారు.
[3] నక్కలు సహా చన్నిచ్చి తమ పిల్లలకు పాలిస్తాయి. అయితే నా ప్రజ ఎడారిలో ఉన్న నిప్పుకోడిలాగా క్రూర ప్రజగా తయారైంది.
[4] దాహంచేత చంటిపిల్ల నాలుక అంగిటికి అంటుకొని ఉంది. పసిపిల్లలు అన్నమడుగుతారు గాని వారికి ఎవరూ పెట్టరు.
[5] మునుపు రుచిగల భోజనం చేసినవారు దిక్కు లేక వీధులలో తిరుగుతున్నారు. ఊదా రంగు గల వస్త్రాలు ధరించి పోషణ పొందినవారు చెత్త కుప్పలమీద పడి ఉన్నారు.
[6] మనుషులెవరూ చెయ్యి వేయకుండానే క్షణంలోనే సొదొమ పట్టణం నాశనం అయింది. నా ప్రజల అపరాధం సొదొమవాళ్ళ పాపంకంటే ఘోరంగా ఉంది.
[7] మునుపు నా ప్రజల నాయకులు హిమంకంటే ప్రకాశమానంగా ఉన్నారు, పాలంటే తెల్లగా ఉన్నారు. వారి శరీరాలు కెంపుకంటే ఎర్రనివి. వారి దేహ కాంతి నీలమణి కాంతిలాంటిది.
[8] ఇప్పుడు వారి ముఖాలు బొగ్గుకంటే నల్లగా ఉన్నాయి. వీధులలో వారిని ఎవరూ గుర్తుపట్టలేరు. వారి చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకొని ఉంది. అది కట్టెలాగా ఎండిపోయింది.
[9] కరవుకు గురి అయి, పొలం పంట లేక నీరసించిపోయి బాధతో చనిపోయినవాళ్ళ కంటే కత్తిపాలైనవాళ్ళ స్థితి మేలు.
[10] జాలిగల స్త్రీలు తమ కన్న పిల్లలనే తమ సొంత చేతులతో వండుకొన్నారు. నా ప్రజలమీదికి వచ్చిన నాశన కాలంలో వారి పిల్లలనే వారు పీక్కు తిన్నారు.
[11] యెహోవా తన ఆగ్రహాన్ని ఎంత మాత్రం అణచుకోకుండా తన తీవ్ర కోపాన్ని కుమ్మరించాడు. సీయోనులో ఆయన మంట రాజబెట్టాడు. అది దాని పునాదులను కాల్చివేసింది.
[12] విరోధులూ శత్రువులూ జెరుసలం ద్వారాల లోపల అడుగు పెట్టగలరని భూరాజులు నమ్మలేదు. లోకంలో ఎవరూ నమ్మలేదు.
[13] అయినా దాని ప్రవక్తల పాపాల కారణంగా, దాని యాజుల అపరాధాల కారణంగా అలా జరిగింది. దానిలో వాళ్ళు నిర్దోషుల రక్తాన్ని ఒలికించారు.
[14] తరువాత వాళ్ళే రక్తంచేత అశుద్ధులై గుడ్డివాళ్ళలాగా వీధులలో తిరుగులాడారు. వాళ్ళ బట్టలను కూడా ముట్టడానికి ఎవరూ తెగించలేదు.
[15] “పోండి! మీరు అశుద్ధంగా ఉన్నారు. పోండి, పోండి! మమ్మల్ని తాకవద్దు” అని ప్రజలు వాళ్ళతో అన్నారు. వాళ్ళు పారిపోయి వేరు స్థలాలలో తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఇతర ప్రజలు “ఇకనుంచి వాళ్ళు ఇక్కడ కాపురముండకూడదు” అన్నారు.
[16] యెహోవా తానే వాళ్ళను చెదరగొట్టాడు. ఆయన వాళ్ళను సహనంతో చూడడం మానుకొన్నాడు. ప్రజలు యాజులను గౌరవించలేదు. పెద్దలను దయ చూడలేదు.
[17] అంతలో సహాయంకోసం వ్యర్థంగా చూస్తూ, మా కండ్లు మందగించాయి. మమ్మల్ని రక్షించలేని జనంకోసం మా కావలి గోపురాలలో నుంచి చూస్తూ ఉన్నాం.
[18] విరోధులు మా అడుగు జాడలను వేటాడారు. మా వీధులలో మేము నడవలేకపోయాం. మాకు అంతం దగ్గరపడింది. మా రోజులు తీరిపోయాయి. అంతం రానే వచ్చింది.
[19] మమ్మల్ని తరిమేవాళ్ళు గాలిలో ఎగిరే గరుడపక్షులకంటే వేగంగా వచ్చారు. వాళ్ళు మమ్మల్ని కొండలమీద తరిమారు, ఎడారిలో మాకోసం పొంచి ఉన్నారు.
[20] యెహోవాచేత అభిషేకం పొందినవాడు వాళ్ళ గుంటలలో చిక్కుపడ్డాడు. అతడు మాకు ముక్కుపుటాల ఊపిరిలాంటివాడు. అతని నీడక్రింద ఇతర జనాల మధ్య బ్రతుకుతామని మేమనుకొన్నాం.
[21] ఊజు దేశంలో నివాసముంటున్న ఏదోం కుమారీ! సంతోషించండి! సంబరపడండి! అయితే ఈ గిన్నెలోది మీరు కూడా త్రాగవలసివస్తుంది. మీరు త్రాగి మత్తిల్లి మిమ్మల్ని దిగంబరం చేసుకొంటారు.
[22] సీయోనుకుమారీ! నీ శిక్ష తీరిపోతుంది. నీవు బందీగా ఉన్న కాలాన్ని యెహోవా పొడిగించడు. ఎదోంకుమారీ! నీ అపరాధాలకు ఆయన నిన్ను దండిస్తాడు, నీ పాపాలను వెల్లడి చేస్తాడు.