[1] యెహోవా కోప దండానికి గురి అయి బాధలు అనుభవించిన మనిషిని నేను.
[2] ఆయన నన్ను పారదోలాడు, చీకటిలోకి నడిపించాడు గాని వెలుగులోకి కాదు.
[3] రోజంతా సారి సారికి ఆయన నామీద చేయి ఎత్తుతూ ఉన్నాడు.
[4] నా చర్మం, నా శరీరం నీరసించిపోయేలా చేశాడు, నా ఎముకలను విరగగొట్టాడు.
[5] ఆయన నన్ను ముట్టడించాడు, నన్ను శ్రమ కష్టాల మధ్య ఉంచాడు.
[6] చాలాకాలం క్రిందట చనిపోయినవాళ్ళలాగా నన్ను చీకటి గల స్థలాలలో ఉండేలా చేశాడు.
[7] నేను తప్పించుకోకూడదని నా చుట్టు గోడ కట్టాడు, బరువైన సంకెళ్ళతో నన్ను బంధించాడు.
[8] నేను మొరపెట్టినా సహాయంకోసం కేకలు వేసినా నా ప్రార్థనను పెడచెవిని పెట్టాడు.
[9] నా త్రోవలో అడ్డంగా చెక్కుడు రాళ్ళు ఉంచాడు. నా మార్గాలను వంకర చేశాడు.
[10] ఆయన నా పట్ల పొంచివున్న ఎలుగుబంటిలాగా, దాగి చూచే సింహంలాగా ప్రవర్తించాడు.
[11] దారినుంచి లాగివేసి నన్ను చీల్చివేశాడు. నాకు దిక్కులేకుండా చేశాడు.
[12] తన విల్లు ఎక్కుపెట్టి నన్ను బాణానికి గురిగా చేశాడు.
[13] తన అంబులపొదిలో ఉన్న బాణాలు నా గుండెలో గుచ్చుకుపోయేలా చేశాడు.
[14] నా ప్రజలందరికీ నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా వాళ్ళు నన్ను గురించి హేళన పాటలు పాడారు.
[15] ఆయన నాకు చేదు పదార్థం తినిపించాడు. నన్ను విషపు ద్రావకం వశం చేశాడు.
[16] గులకరాళ్ళతో నా నోటి పళ్ళను ముక్కలు చేశాడు. బుగ్గిలో నన్ను త్రొక్కాడు.
[17] నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. క్షేమమంటే ఏమిటో మరచిపోయాను.
[18] “నాకు బలం ఉడిగింది, యెహోవామీద నాకు ఆశాభావం లేకుండా పోయింది” అంటున్నాను.
[19] నాకు కలిగిన బాధనూ హింసనూ ఆ విషాన్నీ ఆ చేదునూ తలచుకో!
[20] అవి నా జ్ఞాపకంలో ఎప్పుడూ ఉన్నాయి. నా అంతరంగం అణగారిపోయింది.
[21] అయితే ఒక సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని నేను ఆశాభావంతో ఎదురు చూస్తాను–
[22] యెహోవా దయామయుడు, ఆయన కరుణాక్రియలకు అంతం అంటూ లేదు, గనుకనే మనం నాశనం కాలేదు.
[23] ప్రతి ఉదయమూ ఆయన కొత్తగా కరుణ చూపుతూ ఉంటాడు. యెహోవా! నీ విశ్వసనీయత గొప్పది.
[24] “యెహోవాయే నాకు వంతు. ఆయనకోసమే నేను నమ్మకంతో ఎదురు చూస్తాను” అంటున్నాను.
[25] ఆయనమీద ఆశాభావం ఉంచినవారికి యెహోవా మేలు చేస్తాడు. ఆయనను వెదికే వారిమీద దయ చూపుతాడు.
[26] యెహోవా ఇచ్చే రక్షణకోసం మౌనంగా నమ్మకంతో ఎదురు చూడడం మంచిది.
[27] ఒక వ్యక్తి యువదశలో కాడి మోయడం మంచిది.
[28] అతడిమీద దానిని మోపింది యెహోవా గనుక అతడు మౌనం వహించి ఒంటరిగా కూర్చుని ఉండాలి.
[29] ఆశాభావానికి ఇంకా అవకాశం ఉంటుందేమో అని అతడు నేలను ముఖం మోపాలి.
[30] తనను కొట్టడానికి చూచేవాడివైపు తన చెంపను త్రిప్పాలి. అతడు నిందపాలు కావాలి.
[31] ప్రభువు ఎల్లప్పుడూ మనుషులను విడిచిపెట్టి ఉండడు.
[32] ఆయన వారికి బాధ కలిగించినా జాలిపడుతాడు. ఆయన అనుగ్రహం గొప్పది.
[33] మనుషులకు బాధ గానీ దుఃఖం గానీ కలిగించడం ఆయనకు ఇష్టం లేదు.
[34] దేశంలో ఖైదీలందరినీ కాళ్ళక్రింద త్రొక్కడం,
[35] సర్వాతీతుని ఎదుట మనిషినుంచి న్యాయం తొలగించడం,
[36] మనిషి హక్కును తారుమారు చేయడం జరిగితే ప్రభువు చూడడా?
[37] ప్రభువు సెలవు లేనిది ఎవరు మాట ఇచ్చి నెరవేర్చగలడు?
[38] సర్వాతీతుని నోటి మాటవల్లే గదా, విపత్తు గానీ క్షేమం గానీ కలుగుతుంది.
[39] సజీవులలో ఎవరికైనా తమ అపరాధాలకు శిక్ష వస్తే ఎందుకు మూలగడం?
[40] మన జీవిత విధానాలను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవావైపు మళ్ళీ తిరుగుదాం.
[41] పరలోకంలో ఉన్న దేవునివైపు మన చేతులతోపాటు మన హృదయాన్ని ఎత్తుకొందాం.
[42] “మేము అక్రమ కార్యాలు చేశాం, తిరుగుబాటు చేశాం. నీవు మమ్మల్ని క్షమించలేదు.
[43] నీవు కోపగించి మమ్మల్ని పారదోలావు. కరుణ లేకుండా మమ్మల్ని హతం చేశావు.
[44] ఏ ప్రార్థనా నీదగ్గరికి చేరకుండా మేఘంతో నిన్ను కప్పుకొన్నావు.
[45] జనాలమధ్య మమ్మల్ని మడ్డిలాగా, చెత్తలాగా చేశావు.
[46] మా శత్రువులంతా మమ్మల్ని చూచి దూషిస్తూ ఉన్నారు.
[47] మేము భయానికీ గుంటకూ నాశనానికీ పాడు స్థితికీ గురి అయ్యాం.”
[48] నా జనులు నాశనం కావడం కారణంగా నా కన్నీరు మున్నీరుగా ఉంది.
[49] యెహోవా పరలోకంనుంచి చూచి గమనించేవరకూ
[50] నా కన్నీరు కారడం మానదు.
[51] నా నగరంలో ఉన్న స్త్రీలందరినీ చూస్తూ ఉంటే నాకు మనోవేదన కలుగుతుంది.
[52] నిష్కారణంగా నాకు శత్రువులైనవాళ్ళు నన్ను పక్షిలాగా వేటాడారు.
[53] నన్ను గోతిలో ఉంచి నా ప్రాణం తీయడానికి చూశారు. నామీదికి రాళ్ళు రువ్వారు.
[54] నీళ్ళు నామీదికి ముంచుకు వచ్చాయి, “నాశనమయ్యాను” అనుకొన్నాను.
[55] యెహోవా, లోతైన గోతిలోనుంచి నేను నీ పేర ప్రార్థన చేశాను.
[56] “సహాయంకోసం నా ప్రార్థనలు పెడచెవిని పెట్టకు” అన్న నా మొర నీవు ఆలకించావు.
[57] నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నాదగ్గరికి వచ్చావు. “భయపడకు” అన్నావు.
[58] ప్రభూ! ఆ వివాదంలో నీవు నా పక్షం వహించావు. నా ప్రాణాన్ని విమోచించావు.
[59] యెహోవా, నాపట్ల జరిగిన అన్యాయం నీవు చూశావు. నాకు న్యాయం తీర్చు.
[60] నామీద పగతీర్చుకోవాలని వాళ్ళు చేసిన దురాలోచనలన్నీ నీకు తెలుసు.
[61] యెహోవా, వాళ్ళ దూషణ నీవు విన్నావు. నామీద వాళ్ళు చేసిన దురాలోచనలన్నీ నీకు తెలుసు.
[62] నామీదికి లేచినవాళ్ళ మాటలూ రోజంతా వాళ్ళు పన్నిన కుట్రలూ నీకు తెలుసు.
[63] వాళ్ళను చూడు! వాళ్ళు కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా నన్ను గురించి హేళన పాటలు పాడుతారు.
[64] యెహోవా! వాళ్ళ చేతులు చేసిన పనుల ప్రకారం వాళ్ళకు ప్రతీకారం చెయ్యి.
[65] వాళ్ళ హృదయాన్ని బండబారిపోయేలా చెయ్యి. వాళ్ళను నీ శాపానికి గురి చెయ్యి.
[66] నీవు కోపంగా వాళ్ళను తరిమి, యెహోవా ఆకాశాలక్రింద లేకుండా వాళ్ళను నాశనం చెయ్యి.