Skip to content
Opens in a new window

[1] పూర్వం ఈ నగరం ప్రజలతో నిండి ఉంది. ఇప్పుడది ఏకాంతంగా ఉంది. ఒకప్పుడు అది ఇతర జనాలలో గొప్పది. ఇప్పుడు అది విధవరాలిలాంటిది అయింది. మునుపు అది దేశాలలో రాకుమారిలాంటిది. ఇప్పుడు బానిసలాగా అయింది.

[2] రాత్రి వేళ అది వెక్కివెక్కి ఏడుస్తూ ఉంది. దాని చెంపలమీద కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. దాని ప్రేమికులందరిలో దానిని ఓదార్చడానికి ఎవరూ లేరు. దాని మిత్రులందరూ దానిని మోసం చేశారు. వాళ్ళు దానికి విరోధులయ్యారు.

[3] యూదాప్రజ బాధపాలై కష్టమైన సేవ చేసి దేశభ్రష్టులై బందీలుగా వెళ్ళారు. ఆ జనం ఇతర జనాలలో నివాసం చేస్తూ ఉంది. దానికి విశ్రాంతి లేదు. అది ఇబ్బందులలో ఉండగానే తరిమినవాళ్ళు దానిని చుట్టుముట్టారు.

[4] సీయోను త్రోవలలో దుఃఖమే ఉంది. నియామకమైన పండుగలకు ఎవరూ రావడం లేదు. దాని ద్వారాలన్నీ పాడుగా ఉన్నాయి. దాని యాజులు మూలుగుతూ ఉన్నారు. దాని కన్యలు శోకిస్తూ ఉన్నారు. అది మనోవేదన పాలైంది.

[5] దాని విరోధులు దానిమీద అధికారులయ్యారు. దాని శత్రువులు క్షేమం అనుభవిస్తున్నారు. దాని అనేక అక్రమ కార్యాల కారణంగా దానిని యెహోవా బాధకు గురి చేశాడు. విరోధులు దాని పిల్లలను బందీలుగా తీసుకుపోయారు.

[6] సీయోను కుమారి నుంచి దాని వైభవమంతా పోయింది. దాని నాయకులు మేత దొరకని లేళ్ళలాంటి వాళ్ళయ్యారు. వాళ్ళు నీరసించి, తరిమేవాళ్ళ ఎదుటనుంచి పారిపోయారు.

[7] బాధ, హింస అనుభవిస్తూ ఉన్న ఈ రోజుల్లో జెరుసలం పూర్వకాలంలో ఉన్న విలువైన వస్తువులన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంది. దాని జనం శత్రువుల చేతిలో పడ్డప్పుడు సహాయం చేసేవారెవరూ లేకపోయారు. శత్రువులు దాని నాశనాన్ని చూచి నవ్వారు.

[8] జెరుసలం ఘోరంగా అపరాధం చేసి అశుద్ధం అయిపోయింది. దాని నగ్నతను చూచి, మునుపు దానిని గౌరవించినవాళ్ళు ఇప్పుడు నీచంగా ఎంచుతూ ఉన్నారు. అది మూలుగుతూ వెనక్కు తిరుగుతున్నది.

[9] దాని అశుద్ధత దాని చెంగులకు అంటుకొని ఉంది. అది దాని భవిష్యత్తు విషయం తలచుకోలేదు. దాని పతనం వింత గొలిపేది. దానిని ఎవరూ ఆదరించలేదు. “యెహోవా! శత్రువులు గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా బాధను చూడు!”

[10] దాని విలువైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కాయి. నీ సమాజంలో చేరకూడదని నీవు ఇతర జనాలను గురించి ఆదేశించావు గాని, ఆ జనాలే దాని పవిత్ర స్థానంలో అడుగు పెట్టడం అది చూచింది.

[11] ఆహారాన్ని వెదకుతూ దాని ప్రజలంతా మూలుగుతూ ఉన్నారు. ప్రాణ సంరక్షణకు తమ విలువైన వస్తువులను ఆహారంకోసం ఇచ్చారు. “యెహోవా! ఇదిగో, నేను హీనదశలో ఉన్నాను. నన్ను చూడు!”

[12] “ఈ త్రోవలో ప్రయాణం చేసేవారలారా! ఇది చూచి మీకు ఏమీ విచారం లేదా? కలయ చూడండి! నాకు కలిగిన బాధలాంటి బాధ ఇంకెవరికైనా ఉందా? యెహోవా తీవ్రంగా కోపగించిన రోజున ఈ బాధ నాకు కలిగించాడు.

[13] పైనుంచి ఆయన నా ఎముకలలోకి నిప్పును పంపించాడు. అవి దాని వశం అయ్యాయి. నా పాదాలకు వల పరచాడు. నన్ను వెనక్కు త్రిప్పాడు. నన్ను పాడు చేశాడు. ప్రతి రోజూ నేను నీరసించిపోతూ ఉన్నాను.

[14] ఆయన నా అపరాధాలను కాడిలాగా నాకు కట్టాడు. అవి నేతపనిలాంటిది. అవి నా మెడమీదికి వచ్చాయి. ప్రభువు నా బలం పోయేలా చేశాడు. నేను ఎదిరించలేనివాళ్ళ వశం నన్ను చేశాడు.

[15] నాలో ఉన్న బలాఢ్యులందరినీ ప్రభువు తృణీకరించాడు. నా యువకులను చితగగొట్టాలని సభ కూర్చాడు. యూదా కన్యకుమారిని ద్రాక్షగానుగ తొట్టిలో వేసి యెహోవా త్రొక్కాడు.

[16] అందుచేత నేను ఏడుస్తూ ఉన్నాను. నా కన్నీరు మున్నీరై కారుతూ ఉంది. నా ప్రాణానికి సేద తీర్చడానికీ నన్ను ఓదార్చడానికీ నా దగ్గరగా ఎవరూ లేరు. శత్రువులు గెలిచారు, గనుక నా పిల్లలు దిక్కులేని స్థితిలో ఉన్నారు.”

[17] సీయోను చేతులు చాపుతూ ఉంది గాని, ఓదార్చడానికి ఎవరూ లేరు. యెహోవా యాకోబుప్రజకు చుట్టూరా ఉన్నవాళ్ళు విరోధులుగా ఉండాలని నిర్ణయించాడు. వాళ్ళ మధ్య జెరుసలం అశుద్ధం అయింది.

[18] “యెహోవా న్యాయవంతుడు. ఆయన ఆజ్ఞకు నేను తిరుగుబాటు చేశాను. సమస్త జనాల్లారా! వినండి! నా బాధను చూడండి! నా కన్యలూ యువకులూ దేశభ్రష్టులై బందీలుగా వెళ్ళారు.

[19] నేను నా ప్రేమికులను పిలిపించుకొన్నాను, గానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. నా యాజులూ పెద్దలూ ప్రాణ సంరక్షణకోసం ఆహారాన్ని వెదకుతూ నగరంలోనే నాశనమయ్యారు.

[20] యెహోవా! నావైపు చూడు! నాకు బాధగా ఉంది, అంతరంగంలో అల్లకల్లోలంగా ఉంది. నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను, గనుకనే నా హృదయం తారుమారుగా ఉంది, బయట ఖడ్గం నా పిల్లలను హతం చేస్తూ ఉంది. ఇండ్లలోకి కూడా మృత్యువు చొచ్చింది.

[21] నేను మూలుగుతూ ఉంటే ప్రజలు విన్నారు గాని, నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నీవు నామీదికి రప్పించిన విపత్తు విషయం విని నా శత్రువులందరూ సంతోషిస్తూ ఉన్నారు. వాళ్ళు నాలాగే అయ్యేలా నీవు చాటించిన రోజును రప్పించాలని నా ఆశ.

[22] వాళ్ళ దుర్మార్గమంతా నీ ఎదుటికి వస్తుంది గాక! నా అపరాధాలన్నిటినీ చూచి నీవు నాకు చేసినట్టే వాళ్ళకు చెయ్యి! నా మూలుగులు అనేకం, నా మనసు క్రుంగి ఉంది.”

విలాపవాక్యాలు — Chapters