[1] ప్రభువు సీయోను కుమారిని మేఘంలాగా కోపంతో కప్పాడు. ఆయన ఇస్రాయేల్‌ప్రజల వైభవాన్ని ఆకాశంనుంచి భూమిమీదికి పడవేశాడు. తాను కోపగించే రోజున తనకు పాదపీఠంగా ఉన్న స్థలాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
[2] ఏమీ జాలి చూపకుండా ప్రభువు యాకోబుప్రజల నివాస స్థలాలన్నిటినీ నాశనం చేశాడు. తన కోపాగ్ని కుమ్మరించి యూదా కుమారి కోటలను పడగొట్టివేశాడు. వాటిని నేల మట్టం చేశాడు. అధికారులనూ రాజ్యాన్నీ పాడు చేశాడు.
[3] తీవ్ర కోపంతో ఆయన ఇస్రాయేల్ కొమ్ములన్నింటినీ నాశనం చేశాడు. శత్రువులు దగ్గర అవుతూ ఉంటే తన కుడి చెయ్యి వెనక్కు తీశాడు. మండుతున్న మంటలాగా ఆయన యాకోబు దేశంలో తన చుట్టూరా ఉన్నదంతా కాల్చివేశాడు.
[4] శత్రువులాగా ఆయన తన విల్లు వంచాడు, పగవాడిలాగా దానిమీద కుడిచెయ్యి పెట్టాడు. మన కంటికి అందమైనవాళ్ళందరినీ చంపాడు. సీయోను కుమారి నివాసం మీద మంటల్లాగా తన కోపాగ్నిని కుమ్మరించాడు.
[5] ప్రభువు శత్రువులాగా ప్రవర్తించాడు. ఇస్రాయేల్‌ను దిగమింగివేశాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేశాడు, దాని కోటలను పాడు చేశాడు. ఆయన మూలంగా యూదా కుమారి మధ్య మూలుగులూ రోదన ధ్వనులూ ఎక్కువయ్యాయి.
[6] తోటలో ఉన్న పొదరిల్లులాగా తన నివాసాన్ని నాశనం చేశాడు. తన సమాజ కేంద్రాన్ని పాడు చేశాడు. యెహోవా సీయోను ప్రజను వాళ్ళ నియామకమైన పండుగలనూ విశ్రాంతిదినాలనూ మరచిపోయేలా చేశాడు. కోపోద్రేకం కలిగి రాజునూ యాజినీ త్రోసిపుచ్చాడు.
[7] ప్రభువు తన బలిపీఠాన్ని తృణీకరించాడు. తన పవిత్ర స్థానాన్ని అసహ్యించుకొన్నాడు. దాని భవనాల గోడలను శత్రువుల చేతికి ఇచ్చాడు. నియామకమైన పండుగ రోజున కేకలు వినబడ్డట్టే శత్రువులు యెహోవా ఆలయంలో కేకలు పెట్టారు.
[8] సీయోను కుమారి ప్రాకారాలను ధ్వంసం చేయడానికి యెహోవా నిశ్చయించుకొన్నాడు. ఆయన కొలనూలు సాగదీశాడు. ఆయన చెయ్యి నాశనం చేస్తూ ఉంటే దాన్ని వెనక్కు తీసుకోలేదు. ప్రహరీ, ప్రాకారం కూలగొట్టించాడు. అవి శిథిలమవుతూ ఉన్నాయి.
[9] నగర ద్వారాలు భూమిలోకి దిగబడ్డాయి. దాని అడ్డగడియలను విరిచి ముక్కలు చేశాడు. దాని రాజూ అధికారులూ ఇతర జనాలలోకి వెళ్ళారు. ఇప్పుడు ఉపదేశం లేదు. దాని ప్రవక్తలకు యెహోవానుంచి దర్శనం రావడం లేదు.
[10] సీయోను కుమారి పెద్దలు మౌనం వహించి నేలమీద కూర్చుని ఉన్నారు, తలలమీద దుమ్ము పోసుకున్నారు. గోనెపట్ట కట్టుకొన్నారు. జెరుసలం కన్యలు నేలవైపుకు తలలు వంచుకొన్నారు.
[11] ఏడ్చి ఏడ్చి నా కండ్లు నీరసించిపోతున్నాయి. నా అంతరంగంలో అల్లకల్లోలంగా ఉంది. నా ప్రజ నాశనమయ్యారు, గనుక నా గుండె నేలమీద పడినట్టు ఉంది. చిన్నపిల్లలూ చంటి బిడ్డలూ నగర వీధులలో మూర్ఛపోతున్నారు.
[12] చావుదెబ్బ పొందిన మనిషిలాగా నగర వీధులలో సొమ్మసిల్లుతూ, తల్లుల రొమ్మున ప్రాణం విడుస్తూ “అన్నం, ద్రాక్షరసం ఎక్కడా?” అని అడుగుతూ ఉన్నారు.
[13] జెరుసలం కుమారీ! నేను నిన్ను ఎలా హెచ్చరించాలి? కన్యకుమారి సీయోనూ! నిన్ను ఓదార్చడానికి నిన్ను దేనితో సాటి చేయాలి? దేనితో పోల్చాలి? నీ నష్టం సముద్రమంత గొప్పది. నిన్ను ఎవరు నయం చేయగలరు?
[14] నీ ప్రవక్తలు చూచిన దర్శనాలు వ్యర్థమైనవి, అవివేకమైనవి. నీ ప్రజలను బందీలుగా పోకుండా తప్పించేలా వాళ్ళు నీ అపరాధాన్ని వెల్లడి చేయలేదు. వాళ్ళు పలికిన సోదెలు వ్యర్థమైనవి, తప్పుమార్గం పట్టించేవి.
[15] ఈ దారిన ప్రయాణం చేసేవాళ్ళంతా నిన్ను చూచి చప్పట్లు కొడతారు. జెరుసలం కుమారిని చూచి గేలి చేస్తూ, తలలూపుతూ, “అందంలో లోపం లేని నగరం ప్రజలు అన్నది ఇదేనా? లోకమంతటికీ సంతోషం చేకూర్చే నగరం ఇదేనా?” అంటారు.
[16] నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు బాగా తెరుస్తారు, దూషిస్తూ, పండ్లు కొరుకుతూ ఇలా అంటున్నారు: “దానిని దిగమింగేశాం. ఈ రోజుకోసమే గదా మనం ఎదురు చూచినది. అది వచ్చింది. మనం చూశాం.”
[17] తాను సంకల్పించినది యెహోవా చేశాడు. పూర్వకాలంలో తాను నిర్ణయించినది నెరవేర్చాడు. జాలి చూపకుండా నిన్ను పడవేశాడు. నీమీద నీ పగవాళ్ళ కొమ్ము హెచ్చించి, వాళ్ళు సంతోషించేలా చేశాడు.
[18] నీ ప్రజలు హృదయంలో యెహోవాకు విన్నవించుకొంటున్నారు. “సీయోనుకుమారి ప్రాకారమా! నీమీద రాత్రింబగళ్ళు కన్నీరు మున్నీరుగా ఉండాలి. విరామం ఉండకూడదు. నీ కంటికి విశ్రాంతి రాకూడదు.
[19] లేచి, రాత్రి మొదటి జామున మొర పెట్టు. నీళ్ళలాగా నీ హృదయంలోది ప్రభువు ఎదుట కుమ్మరించు. నీ పిల్లల ప్రాణంకోసం ఆయనవైపు నీ చేతులు ఎత్తు. ప్రతి వీధిలో వారు ఆకలితో మూర్ఛపోతున్నారు.
[20] ఇదిగో, యెహోవా, చూడు! నీవు ఇంకెవరిపట్ల ఇలా వ్యవహరించావు? తాము కని పెంచిన చంటిబిడ్డలను స్త్రీలు తినాలా? ప్రభు పవిత్ర స్థానంలో యాజీ ప్రవక్తా హతం కావాలా?
[21] యువకుడూ వృద్ధుడూ వీధి దుమ్ములో పడి ఉన్నారు. నా కన్యలూ యువకులూ కత్తిపాలై కూలారు. నీవు కోపగించిన రోజున వారిని హతమార్చావు. జాలి చూపకుండా వారిని వధించావు.
[22] నియామకమైన పండుగ రోజుకు పిలిచినట్టే అన్ని వైపులనుంచి నామీదికి రావాలని భయంకరమైనవాటిని పిలిచావు. యెహోవా కోపగించిన రోజున ఎవరూ తప్పించుకోలేదు, ఎవరూ మిగలలేదు. నేను పెంచిన నా చంటిపిల్లలను శత్రువులు నిర్మూలం చేశారు.”