Skip to content
Opens in a new window

[1] “బూర నీ నోటికి పెట్టుకో! శత్రువులు గరుడపక్షిలాగా యెహోవా ఇంటిమీదికి వస్తారు. ఎందుకంటే, ఈ ప్రజలు నా ఒడంబడిక మీరి నా ఉపదేశానికి దూరమయ్యారు.

[2] ఇస్రాయేల్ ప్రజలు ‘మా దేవా! నిన్ను ఎరుగుదుము’ అని నాకు ఆక్రందన చేస్తారు.

[3] అయితే ఇస్రాయేల్ ప్రజలు మంచిని విసర్జించారు. శత్రువులు వారిని తరుముతారు.

[4] నా సమ్మతి లేకుండా వారు రాజులను నియమించుకొన్నారు. నా అనుమతి లేకుండా అధిపతులను ఎన్నుకొన్నారు. తమ వెండి బంగారాలు తీసుకొని తమ కోసం విగ్రహాలు చేసుకొన్నారు. ఇది వారి నాశనానికే.

[5] షోమ్రోను నగరవాసులారా! మీ దూడ విగ్రహం అసహ్యకరం! నా కోపం వారిమీద రగులుకొంది. ఎంతకాలమని వారు నిర్దోషులు కాకుండా ఉంటారు?

[6] ఆ విగ్రహం ఇస్రాయేల్‌వారు చేతితో చేసినదే. స్వర్ణకారుడు దాన్ని చేశాడు. అది దేవుడు కాదు. ఆ షోమ్రోను దూడ చిన్నాభిన్నమవుతుంది.

[7] వారు గాలిని విత్తి తుఫానును కోస్తారు. దంటుకు కంకులు లేవు. అది పంటకు రాదు. ఒకవేళ పంటకు వస్తే విదేశీయులు దాన్ని దిగమ్రింగుతారు.

[8] “ఇస్రాయేల్‌జనాన్ని దిగమ్రింగడం జరిగింది. ఎవరికీ ఇష్టం కాని పాత్రలాగా అది ఇతర జాతుల మధ్య ఉంది.

[9] ఒంటరిగా తిరుగాడే అడవిగాడిదలాగా వారు అష్షూరుకు వెళ్ళారు. ఎఫ్రాయిం కానుకలిచ్చి ప్రేమికులను పిలుచుకొంది.

[10] కానుకలిచ్చి ప్రేమికులను పిలుచుకొన్నా ఆ జనాన్ని ఇప్పుడు సమకూరుస్తాను. మహా పరివారం ఉన్న రాజు పెట్టే భారంక్రింద వారు నీరసించిపోవడం మొదలవుతుంది.

[11] పాపాలకోసమైన బలులు అర్పించడానికి ఎఫ్రాయింవారు అనేక బలిపీఠాలు కట్టారు. అయితే అవి పాపాలు జరిగే స్థలాలయ్యాయి.

[12] “నేను నా ధర్మశాస్త్రంలో గొప్ప విషయాలు వారికోసం వ్రాయించాను గాని అవి విడ్డూరంగా భావించుకొన్నారు.

[13] నాకు అర్పించిన బలిపశువులను వధించి వాటి మాంసం తింటారు. కానీ వారంటే యెహోవాకు సంతోషం లేదు. ఇప్పుడు వారి అపరాధాన్ని తలచుకొని వారి పాపాలను చూచి వారిని శిక్షిస్తాడు. వారు ఈజిప్ట్‌కు మళ్ళీ వెళ్ళవలసివస్తుంది.

[14] ఇస్రాయేల్ ప్రజ తమ సృష్టికర్తను మరచిపోయి భవనాలు కట్టుకొన్నారు. యూదాప్రజ కోట, గోడల పట్టణాలు కట్టుకొన్నారు. అయితే నేను వారి పట్టణాల మీదికి జ్వాలలను పంపుతాను. అవి వాటి భవనాలను కాల్చివేస్తాయి.

హోషేయ — Chapters