Skip to content
Opens in a new window

[1] ఎఫ్రాయిం గాలి మేసే జనం. తూర్పు గాలిని తరుముతూ ఉంటారు, మానక రోజంతా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. అష్షూరువారితో సంధి చేస్తారు. ఈజిప్ట్‌కు నూనె పంపివేస్తారు.

[2] యూదావారిమీద కూడా యెహోవా నేరారోపణ చేయవలసివచ్చింది. యాకోబు ప్రజలను వారి ప్రవర్తనను బట్టి శిక్షిస్తాడు. వారి పనులకు తగినట్టుగా వారికి ప్రతీకారం చేస్తాడు.

[3] తల్లి గర్భంలో యాకోబు తన తోబుట్టినవాడి కాలి మడమను పట్టుకొన్నాడు. పెరిగి పెద్దవాడయ్యాక అతడు దేవునితో పోరాడాడు.

[4] అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీళ్ళు విడుస్తూ దయ చూపమని ఆ దూతను ప్రాధేయపడ్డాడు. బేతేల్‌లో అతడు ఆయనకు దొరికాడు. అక్కడ ఆయన అతడితో మాట్లాడాడు –

[5] ఆయన ప్రఖ్యాతి గల పేరు యెహోవా, సేనల దేవుడు యెహోవా.

[6] అందుచేత మీరు మీ దేవునివైపుకు తిరగండి. దయగా న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండండి. ఎడతెరపి లేకుండా మీ దేవునికోసం నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండండి.

[7] ఎఫ్రాయింవారు కనానుజాతి వర్తకుడిలాంటివారు. వారి త్రాసు మోసకరం. వంచించడానికి వారు ఇష్టపడుతారు.

[8] ఎఫ్రాయింవారు “మేము ధనవంతులం, మాకు చాలా ఆస్తిపాస్తులు లభించాయి. అయితే మా కష్టార్జితమంతా చూచి శిక్షకు తగిన అపరాధం మాలో ఉన్నట్టు ఎవ్వరూ చూపించలేరు” అని చెప్పుకొంటారు.

[9] “నేను యెహోవాను, మీరు ఈజిప్ట్ విడిచి వచ్చినప్పటినుంచి మీ దేవుణ్ణి. నియామకమైన పండుగ రోజులలాగే మిమ్ములను మళ్ళీ డేరాలలో నివసించేలా చేస్తాను.

[10] నేను ప్రవక్తలతో మాట్లాడాను. వారికి అనేక దర్శనాలు ప్రసాదించాను. వారిద్వారా ఉదాహరణలు ఇచ్చాను.”

[11] గిలాదువారు చెడ్డవారు కారా? అక్కడి నివాసులు వ్యర్థులు! గిల్‌గాల్‌లో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు సాగు చేసిన పొలంలో ఉన్న రాళ్ళ కుప్పలలాగా అవుతాయి.

[12] యాకోబు సిరియాదేశానికి పారిపోయాడు. భార్య కావాలని ఇస్రాయేల్ సేవ చేశాడు. భార్య కావాలని గొర్రెలు కాచాడు.

[13] యెహోవా ఇస్రాయేల్ ప్రజలను ఈజిప్ట్ నుంచి గొర్రెలు తీసుకురావడానికి ఒక ప్రవక్తను వినియోగించు కొన్నాడు. వారిని కాపాడడానికి కూడా ఒక ప్రవక్తను ఉపయోగించుకొన్నాడు.

[14] ఎఫ్రాయింవారు ఘోరమైన కోపానికి కారకులు. వారు రక్తపాతం చేశారు. ప్రభువు వారిమీద ఆ అపరాధం నిలిచి ఉండనిస్తాడు. వారు చేసిన తిరస్కారానికి ప్రతీకారం చేస్తాడు.

హోషేయ — Chapters