Skip to content
Opens in a new window

[1] మునుపు ఎఫ్రాయింవారు మాట్లాడితే ఇతరులు వణికారు. ఇస్రాయేల్‌లో ఆ గోత్రం ఘనతకెక్కింది. అయితే బయల్ దేవుడి విషయంలో అపరాధం చేసి నశించిన స్థితిలోకి దిగజారిపోయింది.

[2] ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకోసం వెండితో పోత విగ్రహాలను చేయించు కొన్నారు. అవి పనివారు నిపుణతతో చేసినవి. ఈ ప్రజను గురించి ఏమంటారంటే, “ఆ దూడ విగ్రహాలకు బలులర్పించేవాళ్ళు వాటిని ముద్దాడుతారు.”

[3] అందుచేత ఈ ప్రజ ఉదయం మంచులాగా, ప్రొద్దున త్వరగానే ఆరిపోయే మంచులాగా ఉంటారు. కళ్ళంలోనుంచి గాలి ఎగరగొట్టే పొట్టులాగా కిటికీలో గుండా పోయే పొగలాగా ఉంటారు.

[4] “నేను యెహోవాను, మీరు ఈజిప్ట్ దేశాన్ని విడిచి వచ్చినప్పటినుంచి మీ దేవుణ్ణి. నేను తప్ప మరే దేవుణ్ణి లక్ష్యపెట్టకూడదు. నేను తప్ప రక్షకుడెవ్వడూ లేడు.

[5] ఎడారిలో – మహా ఎండకు కాలిన ఆ ప్రదేశంలో – మిమ్ములను లక్ష్యపెట్టాను.

[6] నేను వారికి ఆహారం ప్రసాదించినప్పుడు వారు తిని తృప్తిపడ్డారు. తృప్తిపడి గర్వించారు. అప్పుడు వారు నన్ను మరచిపోయారు.

[7] గనుక నేను వారిపట్ల సింహంలాగా వ్యవహరిస్తాను. వారి దారి ప్రక్కన చిరుతపులిలాగా పొంచి ఉంటాను.

[8] పిల్లలు పోయిన ఎలుగుబంటిలాగా నేను వారి పైబడి వారి గుండెలను చీల్చివేస్తాను. ఆడసింహంలాగా వారిని మ్రింగివేస్తాను. అడవిమృగం వారిని చీల్చి ముక్కలు చేస్తుంది.

[9] ఇస్రాయేల్ ప్రజలారా! మీకు అండగా ఉన్న నన్ను ఎదిరించిన కారణంగా మీకు నాశనం తప్పదు.

[10] మీ పట్టణాలలో దేనిలో అయినా మిమ్ములను మీ రాజు రక్షించాలంటే అతడు ఏమయ్యాడు? మీ నాయకులు ఏమయ్యారు? ‘రాజునూ అధిపతులనూ మామీద నియమించుమ’ని మీరు మనవి చేశారు,

[11] నేను కోపపడి మీకు రాజును నియమించాను. ఇప్పుడు ఆగ్రహించి మీ రాజును తొలగించాను.

[12] “ఎఫ్రాయింవారి అపరాధాలు వ్రాసి ఉన్నాయి. వారి పాపాలు పోగుపడుతూ ఉన్నాయి.

[13] ప్రసవవేదనలాంటి వేదనలు వారికి వచ్చాయి. అయితే పిల్ల పుట్టే సమయంలో వారు బయటికి రాని శిశువులాంటివారు. వారు తెలివితేటలు లేనివారు.

[14] “మృత్యులోక వశంలోనుంచి నేను వారిని విమోచిస్తాను. వెల ఇచ్చి మరణంనుంచి వారిని విడిపిస్తాను. మరణమా! నీ విజయమెక్కడ? ఓ మృత్యులోకమా! నీ విషపుకొండి ఎక్కడ? నేను పశ్చాత్తాపపడను.

[15] ఎఫ్రాయిం వారు తమ సోదరులలో వర్ధిల్లినా, తూర్పు గాలి – యెహోవా పుట్టించే గాలి – ఎడారినుంచి వీస్తుంది; వారి నీటిబుగ్గలు ఎండిపోతాయి, బావులు ఇంకిపోతాయి. వారు కూడబెట్టుకొన్న విలువైన వస్తువులన్నిటినీ కొల్లగొట్టడం జరుగుతుంది.

[16] షోమ్రోనుప్రజలు తమ దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు, గనుక శిక్షకు గురి అవుతారు. వారు కత్తిపాలవుతారు. వారి పిల్లలను రాళ్ళకు వేసి ముక్కలు చేయడం, గర్భిణి స్త్రీల కడుపులు చీల్చడం జరుగుతుంది.”

హోషేయ — Chapters