[1] “రండి, మనం యెహోవావైపు మళ్ళీ తిరుగుదాం. ఆయన మనలను చీల్చి ముక్కలు చేశాడు గాని ఆయన మనలను బాగు చేస్తాడు. మనలను గాయపరచాడు గాని మన గాయాలకు కట్టు కడతాడు.
[2] ఇంకా రెండు రోజులకు ఆయన మనలను బ్రతికిస్తాడు. ఆయన సమక్షంలో మనం బ్రతికేలా మూడో రోజున ఆయన మనలను పైకెత్తుతాడు.
[3] యెహోవాను తెలుసుకొందాం. ఆయనను తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ప్రొద్దు పొడవడం ఎంత నిశ్చయమో ఆయన రావడం అంత నిశ్చయం. వర్షంలాగా, భూమిని తడిపే తొలకరి వానలాగా ఆయన మనదగ్గరికి వస్తాడు.”
[4] “ఎఫ్రాయింవారలారా! మిమ్ములను నేనేమి చేయాలి? యూదాప్రజలారా! నేను మిమ్ములను చేయవలసినదేమిటి? మీ భక్తి ఉదయం పొగమంచులాగా, ప్రొద్దున త్వరగానే ఆరిపోయే మంచులాగా ఉంది.
[5] అందుచేత మిమ్ములను ప్రవక్తల మూలంగా ఖండించాను. నా నోటి మాటలచేత మిమ్ములను చంపివేశాను, నా తీర్పులు మీ మీదికి మెరుపులాగా వచ్చాయి.
[6] మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు. హోమాలు అర్పించడంకంటే దేవుణ్ణి గురించిన జ్ఞానం మీకు కలగడం నాకిష్టం.
[7] ఆదాములాగా వారు నా ఒడంబడిక మీరి నాపట్ల స్వామిద్రోహం చేశారు.
[8] గిలాదు చెడుగు చేసేవాళ్ళతో నిండిన పట్టణం అక్కడ రక్తమయమైన అడుగుజాడలు కనిపిస్తున్నాయి.
[9] యాజుల గుంపు దోపిడీ దొంగలలాగా మాటులో పొంచివుంటారు. షెకెంకు పోయే త్రోవలో వాళ్ళు హత్య చేస్తారు, సిగ్గుమాలిన పనులు చేస్తారు.
[10] ఇస్రాయేల్ రాజ్యంలో ఘోరమైన సంగతి నాకు కనిపించింది. అక్కడ ఎఫ్రాయింవాళ్ళు వేశ్యలాగా ప్రవర్తిస్తున్నారు. ఇస్రాయేల్‌వారు తమను అశుద్ధం చేసుకొన్నారు.
[11] యూదావారలారా! నేను నా ప్రజలకు ముందున్న క్షేమస్థితిని మళ్ళీ ప్రసాదించినప్పుడు మీకు కూడా పంట కోత జరుగుతుందని నియమించాను.