[1] “మీరు మీ సోదరులను ‘నా జనం’ అనండి; మీ సోదరీలను ‘వాత్సల్యం పొందినవారు’ అనండి.
[2] “మీ తల్లితో వాదించండి, వాదించండి. ఆమె నా భార్య కాదు. నేను ఆమె భర్తను కాను. ఆమె తన కండ్లనుంచి వ్యభిచారం చూపులు తొలగించుకోవాలి. తన రొమ్ము మీదనుంచి తన జారత్వాన్ని తీసివేసుకోవాలి.
[3] లేకపోతే ఆమెను దిగంబరం చేస్తాను. ఆమె బట్టలు తీసివేసి పుట్టిన నాటిలాగా ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను నీళ్ళు లేని ఎడారిగా చేస్తాను. దాహంచేత ఆమెను చంపుతాను.
[4] ఆమె సంతానం వ్యభిచారంవల్ల పుట్టినవారు గనుక వారిపట్ల వాత్సల్యం చూపను.
[5] వారి తల్లి వ్యభిచారిణిలాగా ప్రవర్తించింది. వారిని కన్న ఆమె సిగ్గుమాలిన విధంగా మసులుకొంది. ఆమె ఇలా అంది: ‘నా విటులు నాకు ఆహారం, నీళ్ళు, గొర్రెబొచ్చు, జనపనార, నూనె, మద్యం ఇస్తున్నారు. వాళ్ళ వెంట పోతాను.’
[6] అందుచేత ఆమె త్రోవకు ముండ్ల కంచె అడ్డంగా వేస్తాను. ఆమెకు తన త్రోవలేమీ కనిపించకుండా గోడ నిర్మిస్తాను.
[7] తన ప్రేమికులను వెంటాడుతూ ఉన్నప్పుడు వారిని కలుసుకోలేకపోతుంది. ఎంత వెదికినా వారు కనబడరు. అప్పుడామె ‘నా మొదటి భర్తదగ్గరికి తిరిగి పోతాను. ఇప్పటికంటే అప్పుడు నా స్థితిగతులు బాగున్నాయి’ అనుకొంటుంది.
[8] ఆమెకు ధాన్యం, ద్రాక్షరసం, నూనె, చాలా వెండి బంగారాలు ఇచ్చినది నేనే అని ఒప్పుకోకుండా అవి బయల్ దేవుడికోసం వినియోగించు కొన్నారు.
[9] “గనుక కోత కాలంలో నా ధాన్యం ఆమె దగ్గరనుంచి తీసివేస్తాను. దాని కాలంలో నా ద్రాక్షరసం తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకొనేందుకు ఇద్దామనుకొన్న గొర్రెబొచ్చు, జనపనార తీసివేస్తాను.
[10] ఆమె ప్రేమికుల కండ్లెదుటే ఆమె సిగ్గుమాలిన ప్రవర్తన వెల్లడి చేస్తాను. నా చేతిలోనుంచి ఆమెను ఎవ్వరూ విడిపించరు.
[11] ఆమె ఉత్సవకాలాలనూ పండుగలనూ అమావాస్యలనూ విశ్రాంతి దినాలనూ – ఆమె నియామక కాలాలన్నిటినీ నిలిపివేస్తాను.
[12] ఆమె ద్రాక్ష చెట్లనూ అంజూరు చెట్లనూ పాడు చేస్తాను. ‘అవి నా ప్రేమికులు నాకిచ్చిన జీతం’ అని ఆమె చెప్పింది గదా. వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను. అడవి జంతువులు వాటిని తింటాయి.
[13] ఆమె నన్ను మరిచిపోయి బయల్ దేవుడి విగ్రహాలకు ధూపం వేసింది, నగలూ ఆభరణాలూ పెట్టుకొని ఆమె ప్రేమికుల వెంట వెళ్ళింది గనుక నేను ఆమెను శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
[14] “అయినా, ఆమెను ఆకర్షించి ఎడారిలోకి నడిపించి ఆమెతో మృదువుగా మాట్లాడుతాను.
[15] అక్కడ ఆమెకు ఆమె ద్రాక్షతోటలు మళ్ళీ ఇస్తాను. ‘ఆకోరు లోయ’ను ఆశాభావానికి ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యువప్రాయంలో, ఈజిప్ట్‌నుంచి వచ్చిన కాలంలో లాగే మళ్ళీ గానం చేస్తుంది.
[16] ఆ రోజు నీవు నన్ను భర్త అంటావు. అప్పటినుంచి యజమాని అనవు. ఇది యెహోవా వాక్కు.
[17] బయల్ దేవుళ్ళ పేర్లు ఆమె నోట రాకుండా చేస్తాను. అప్పటినుంచి ఆ పేర్లు మళ్ళీ జ్ఞప్తికి కూడా రావు.
[18] ఆ రోజు నా ప్రజకోసం అడవి జంతువులతో గాలిలో ఎగిరే పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా నిద్రపోయేలా చేస్తాను.
[19] నీవు శాశ్వతంగా నా భార్యవై ఉండేలా చేస్తాను. నీతిన్యాయాలలో, కృప కనికరాలలో,
[20] విశ్వసనీయతలో నీవు నా భార్యవై ఉండేలా చేస్తాను. అప్పుడు నీవు యెహోవాను తెలుసుకొంటావు.
[21] “ఆ రోజున నేను మాట్లాడుతాను. ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమితో మాట్లాడుతాయి.
[22] భూమి ధాన్యంతో, ద్రాక్షరసంతో, నూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రేల్‌తో మాట్లాడుతాయి.
[23] నేను ఆమెను దేశంలో నాటుకొంటాను. వాత్సల్యం పొందని ఆమెపట్ల వాత్సల్యం చూపుతాను. ‘నా ప్రజ కానివారిని’ చూచి ‘మీరు నా ప్రజ’ అంటాను. వారు నన్ను ‘నీవు మా దేవుడివి’ అంటారు. ఇది యెహోవా వాక్కు.”