[1] ఇస్రాయేల్ ప్రజ వ్యాపిస్తూ ఉన్నా, ద్రాక్ష చెట్టులాగా ఉండేదీ వారు ఫలించినదీ తమ కోసమే. ఫలం ఎక్కువ అయినకొద్దీ వారు ఎక్కువ బలిపీఠాలను కట్టుకొన్నారు. వారి భూమి సారవంతమైన కొద్దీ వారి దేవతాస్తంభాలను అలంకరించారు.
[2] వారిది కపట మనసు. ఇప్పుడు వారి అపరాధానికి వారు శిక్ష పొందాలి. యెహోవా వారి బలిపీఠాలను బ్రద్దలు చేస్తాడు. వారి దేవతాస్తంభాలను పాడు చేస్తాడు.
[3] అప్పుడు వారు ఇలా చెప్పుకొంటారు: “యెహోవా అంటే మనకు భయభక్తులు లేకపోవడం కారణంగా మనకు రాజు లేడు. రాజు ఉన్నా మనకోసం ఏం చేయగలుగుతాడు?”
[4] వారు వాగ్దానాలు చేస్తారు. అబద్ధ శపథాలు చేస్తారు. ఒప్పందాలు చేసుకొంటారు. అందుచేత వ్యాజ్యాలు పొలం చాళ్ళలోని విషపు మొక్కలలాగా అంకురిస్తాయి.
[5] షోమ్రోను నగరవాసులు బేత్‌ఆవెనులో ఉన్న దూడ విగ్రహం విషయం కంగారుపడుతారు. ప్రజలూ పూజారులూ – దాని ఘనత విషయం సంతోషించేవాళ్ళంతా – అది పోయిందని విచారపడుతారు.
[6] అష్షూరువాళ్ళు దాన్ని తీసుకుపోయి వాళ్ళ మహారాజుకు కానుకగా ఇస్తారు. ఎఫ్రాయింవాళ్ళకు తలవంపులు కలుగుతాయి. ఇస్రాయేల్ ప్రజలు తాము అనుసరించిన ఆలోచనలను బట్టి సిగ్గుపడుతారు.
[7] షోమ్రోను నాశనం అవుతుంది. దాని రాజు నీళ్ళమీద విరిగి పడిపోయిన రెమ్మలాగా కొట్టుకుపోతాడు.
[8] ఆవెనులో ఉన్న ఎత్తయిన పూజా స్థలాలు, ఇస్రాయేల్‌వారు పాపం చేసిన ఆ స్థలాలు నాశనం అవుతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు వారి బలిపీఠాలమీదికి పెరుగుతాయి. ఆ కాలంలో వారు పర్వతాలతో “మమ్మల్ని మరుగు చేయండి!” అంటారు, కొండలతో “మా మీద పడండి!” అంటారు.
[9] “ఇస్రాయేల్ ప్రజలారా, గిబియా రోజులనుంచి మీరు పాపాలు చేస్తూనే ఉన్నారు. మీరు ఆ స్థితిలో ఉండిపోయారు. అయితే గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం రాలేదా?
[10] నాకు ఇష్టం వచ్చినప్పుడు వారిని శిక్షిస్తాను. విదేశీయులు సమకూడి వారిమీదికి వచ్చి వారిని బంధిస్తారు. వారు చేసిన రెండు పాపాల కారణంగా ఇలా జరుగుతుంది.
[11] “ఎఫ్రాయిం జనం తర్బీతు పొందిన పెయ్యలాగా ఉంది. నూర్పిడి అంటే దానికి చాలా ఇష్టం గనుక దాని నున్నని మెడకు నేను కాడి వేస్తాను. దాన్ని నాగటికి కడతాను. యూదావారు భూమి దున్నాలి. యాకోబు ప్రజలు దాన్ని చదును చేయాలి.
[12] మీకోసం న్యాయాన్ని విత్తనాలలాగా చల్లండి! కరుణ అనే పంట వచ్చేలా చేయండి! యెహోవా వచ్చి నీతి న్యాయాలను మీమీద కురిపించేవరకూ ఆయనను వెదకడానికి సమయం ఇదే గనుక మీ బీడు భూమి దున్నండి!
[13] మీరు దుర్మార్గాన్ని నాటారు. చెడుగు అనే కోత కోశారు. వంచన ఫలాలు తిన్నారు. ఎందుకంటే, మీ విధానాలమీద, మీ అనేక వీరులమీద నమ్మకం ఉంచారు.
[14] అందుచేత మీ ప్రజలమీదికి అల్లరి వస్తుంది. యుద్ధకాలంలో షల్మానురాజు బేత్‌అర్బేల్‌ను పాడు చేసినట్టే మీ కోటలన్నీ నాశనం అవుతాయి. ఆ రోజు తల్లులు పిల్లలతోపాటు నేలకు పడగొట్టబడి ముక్కలయ్యారు.
[15] బేతేల్ నివాసులారా! మీ దుర్మార్గం ఘోరమైనది. గనుక మీకు అలాగే జరుగుతుంది. ఆ రోజు ఉదయం కాగానే ఇస్రాయేల్ ప్రజల రాజు తప్పక నశించిపోతాడు.