[1] మీలో సంఘం పెద్దలకు సాటి పెద్దనూ క్రీస్తు బాధలను చూచినవాణ్ణీ వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణీ అయిన నేను ఈ ప్రోత్సాహం ఇస్తున్నాను:
[2] మీదగ్గర ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకంగానే, దుర్లాభం కావాలని కాదు గాని ఆసక్తితో నాయకులుగా సేవ చేయండి.
[3] మీ బాధ్యత క్రింద ఉంచబడ్డవారిమీద ప్రభువులాగా ఉండకుండా మందకు ఆదర్శంగా ఉండండి.
[4] ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
[5] యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయం వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే, “దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయం గలవారికి కృప చూపుతాడు.”
[6] అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్ములను పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్ఠమైన చేతిక్రింద మిమ్ములను మీరే తగ్గించుకోండి.
[7] ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి.
[8] స్థిరబుద్ధి కలిగి మెళకువగా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు.
[9] నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసు గదా.
[10] మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత, సర్వ కృపానిధి అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు.
[11] ఆయనకే మహిమ అధికారం యుగయుగాలకు ఉంటుంది గాక! తథాస్తు.
[12] నమ్మకమైన సోదరుడని నేను ఎంచిన సిల్వానస్ సహాయంతో నేను క్లుప్తంగా రాస్తూ మిమ్ములను ప్రోత్సాహపరుస్తూ, మీరు ఏ కృపలో నిలిచి ఉన్నారో అది దేవుని నిజమైన కృప అని సాక్ష్యం చెపుతున్నాను.
[13] బబులోనులో ఉన్న ఆమె – మీతోకూడా ఎన్నుకోబడ్డ ఆమె – అభివందనాలు మీకు చెపుతున్నది. ఆధ్యాత్మిక రీతిలో నా కుమారుడు మార్కు కూడా చెపుతున్నాడు.
[14] ప్రేమను సూచించే ముద్దుతో ఒకరినొకరు వందనాలు చేసుకోండి. క్రీస్తు యేసులో ఉన్న మీకందరికీ శాంతి కలుగుతుంది గాక! తథాస్తు.