Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:18

[1] పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ ప్రాంతాలలో చెదరిపోయిన యూదులలో పరాయివారుగా ఉండి తండ్రి అయిన దేవునిచేత ఎన్నుకోబడ్డ వారికి యేసు క్రీస్తు రాయబారి అయిన పేతురు రాస్తున్న విషయాలు.

[2] దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నది తన భవిష్యత్ జ్ఞానం ప్రకారం, తన ఆత్మ పవిత్రపరచే పనివల్ల, విధేయతకూ, యేసు క్రీస్తు రక్త ప్రోక్షణకూ. మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా కలుగుతాయి గాక!

[3] మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక! యేసు క్రీస్తును చనిపోయిన వారిలోనుంచి లేపడం ద్వారా, దేవుడు తన మహా కరుణ ప్రకారం మనకు కొత్త జన్మం కలిగించాడు. ఇది సజీవమైన ఆశాభావానికీ

[4] నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికీ. ఈ వారసత్వం మీ కోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది.

[5] కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం, నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి.

[6] దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షలవల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో.

[7] ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే, ఎంతో విలువగలది. దానికి జ్వాలలచేత పరీక్ష కలిగినా, అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణంగా కనబడాలి.

[8] మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు.

[9] మీరు మీ విశ్వాస ఫలితం, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు.

[10] మీకు కలిగే కృపను గురించి ముందుగానే పలికిన ప్రవక్తలు ఈ విముక్తిని గురించి విచారిస్తూ శ్రద్ధాసక్తులతో పరిశీలించారు.

[11] తమలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధలనూ వాటి తరువాత కలిగే మహిమగలవాటినీ ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు ఏ కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి విచారించారు

[12] ఈ విషయాలలో వారు సేవ చేసేది తమకోసం కాకుండా మన కోసమని వారికి వెల్లడి చేయబడింది. పరలోకంనుంచి పంపబడ్డ పవిత్రాత్మచేత ప్రస్తుతం మీకు శుభవార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకు చెప్పారు. దేవదూతలు కూడా ఈ విషయాలను చేరువగా చూడడానికి తహతహలాడుతున్నారు.

[13] అందుచేత కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృపకోసం సంపూర్ణమైన ఆశాభావంతో ఎదురు చూడండి.

[14] విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి.

[15] మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి.

[16] ఎందుకంటే, “నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.

[17] ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి.

[18] ఎందుకంటే మీకు తెలిసినదేమంటే, మీ పూర్వీకులనుంచి పారంపర్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్ములను విడిపించింది వెండి బంగారాలలాంటి నాశనమయ్యే వస్తువులతో కాదు

[19] గాని ఏ లోపమూ కళంకమూ లేని గొర్రెపిల్లలాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే.

[20] జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమించబడ్డాడు గాని ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షం అయ్యాడు.

[21] ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నవారు. దేవుడాయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ నమ్మకం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.

[22] మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడంచేత మీ హృదయాలను మీరు పవిత్రంగా చేసుకొన్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా, శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి.

[23] ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజంనుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కానిదాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు.

[24] ఎందుకంటే, “శరీరం ఉన్నవారంతా గడ్డిలాంటివారు, మానవ వైభవమంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది

[25] గాని ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.” మీకు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే.

1 పేతురు లేఖ — Chapters