[1] అలాగే పెండ్లయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనమూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు.
[2] భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు.
[3] జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం – మీది ఇలాంటి బయటి అలంకారం కాకూడదు.
[4] దానికి బదులు మీ లోపలి స్వభావం – శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది.
[5] ఇలాగే గతంలో దేవునిమీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకొనేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు.
[6] ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలయింది. మీరు ఎలాంటి బీతిభయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు.
[7] పెండ్లయిన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురముండండి. కృపవల్ల కలిగిన జీవంలో వారు మీతోకూడా పాలివారనీ మీకంటే బలహీనమైన పాత్రలనీ వారిని గౌరవించండి.
[8] తుదకు, మీరంతా ఏక భావంతో ఉండండి, సానుభూతితో ఒకరినొకరు చూడండి. సోదర ప్రేమతో, దయతో, మర్యాదతో బ్రతకండి.
[9] కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుండా దీవించండి. మిమ్ములను పిలిచింది మీరిలా చేసి దీవెనకు వారసులయ్యేందుకే.
[10] బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచి రోజులు చూడగోరేవారెవరైనా తమ నాలుకను చెడు నుంచి, పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకోవాలి.
[11] చెడునుంచి వైదొలగాలి, మంచినే చేస్తూ ఉండాలి, శాంతిని వెదికి అనుసరించాలి.
[12] ప్రభు దృష్టి న్యాయవంతులమీద ఉంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు తెరచి ఉన్నాయి. గానీ ప్రభు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
[13] మీరు మేలైనదాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు?
[14] ఒకవేళ నీతినిజాయితీకోసం బాధలకు గురి కావలసివచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారుపడవద్దు.
[15] మీ హృదయాలలో ప్రభువైన దేవుణ్ణి ప్రతిష్టించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికీ సాత్వికంతో భయభక్తులతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
[16] క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకొనే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి.
[17] ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే, చెడుతనం చేసి బాధలకు గురి కావడం కంటే అది మేలు.
[18] మనలను దేవుని దగ్గరకు తేవడానికి న్యాయవంతుడైన క్రీస్తు న్యాయం తప్పినవారికోసం పాపాల విషయంలో ఎప్పటికీ ఒకే సారి బాధలు అనుభవించాడు. శారీరకంగా ఆయన చంపబడ్డాడు. దేవుని ఆత్మచేత సజీవమయ్యాడు.
[19] ఈ ఆత్మద్వారా ఆయన వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు చాటింపు చేశాడు.
[20] ఆ ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవహు రోజులలో, ఓడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో. ఆ ఓడలో కొద్దిమందినే, అంటే ఎనిమిదిమందినే నీళ్ళద్వారా రక్షించడం జరిగింది.
[21] దానికి అనుగుణమైన చిహ్నం – బాప్తిసం – ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. అది శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు గానీ దేవుని పట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు. ఈ రక్షణ యేసు క్రీస్తు పునర్జీవితం ద్వారానే కలిగేది.
[22] ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతలమీద, అధికారులమీద, బలాఢ్యులమీద అధికారం కలిగింది.