Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:50

[1] మన దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిన్యాయాల మూలంగా మాలాగే అమూల్య విశ్వాసం స్వీకరించినవారికి యేసు క్రీస్తు పంపిన రాయబారీ దాసుడూ అయిన సీమోను పేతురు రాస్తున్న సంగతులు.

[2] దేవుణ్ణి, మన ప్రభువైన యేసును గురించిన జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి అధికమవుతాయి గాక!

[3] తన మహిమను సుగుణాన్ని బట్టీ మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవానికీ భక్తికీ కావలసిన దంతా ఆయన దైవిక బలప్రభావాలు మనకు ఇచ్చాయి.

[4] ఆ మహిమ, సుగుణాలను బట్టి ఆయన ఎంతో గొప్ప ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మీరు లోకంలో దురాశవల్ల కలిగిన భ్రష్టత్వంనుంచి తప్పించుకొని దైవిక స్వభావంలో పాలివారు కావాలని ఆయన ఉద్దేశం.

[5] ఈ కారణంచేతనే మీరు పూర్ణ శ్రద్ధాసక్తులు కలిగి మీ విశ్వాసంతో సుగుణం సమకూర్చుకోండి. సుగుణంతో జ్ఞానం,

[6] జ్ఞానంలో నిగ్రహం, నిగ్రహంతో సహనం, సహనంతో భక్తి,

[7] భక్తితో సోదరులపట్ల అనురాగం, ఆ అనురాగంతో దైవిక ప్రేమ సమకూర్చుకోండి.

[8] ఇవి మీకు ఉండి అధికం అవుతూ ఉంటే మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో వ్యర్థంగా, నిష్‌ఫలంగా ఉండరు.

[9] కానీ ఇవి లేని వ్యక్తి తన గత పాపాలకు శుద్ధి కలిగిన విషయం మరచిపోయినవాడు, గుడ్డివాడు, లేదా, దూరదృష్టి లేనివాడు.

[10] అందుచేత, సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచి ఎన్నుకొన్న విషయం నిశ్చయం చేసుకోవడానికి మరెక్కువగా శ్రద్ధాసక్తులు వహించండి. వీటి ప్రకారం నడుచుకొంటూ ఉంటే మీరెన్నడూ తొట్రుపడరు.

[11] ఈ విధంగా మీకు మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు శాశ్వత రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది.

[12] కాబట్టి, మీరు ఈ విషయాలు తెలుసుకొని ఉన్న సత్యంలో నిలకడగా ఉన్నా, వీటిని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేయడానికి నిర్లక్ష్యంగా ఉండను.

[13] నా గుడారాన్ని నేను త్వరలో విడిచి పెట్టవలసివస్తుందని నాకు తెలుసు. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టం చేశాడు,

[14] గనుక ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ మిమ్ములను పురికొల్పడం యుక్తమని నాకు తోస్తున్నది.

[15] అంతేకాక, నేను చనిపోయిన తరువాత కూడా ఈ విషయాలు ఎప్పుడూ మీ జ్ఞాపకంలో ఉండేలా శ్రద్ధాసక్తులు తీసుకొంటాను.

[16] ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు బలప్రభావాలనూ రాకడనూ గురించి మేము మీకు తెలియజేసి నప్పుడు యుక్తితో కల్పించిన కట్టుకథలను అనుసరించి చెప్పలేదు గాని ఆయన దివ్యత్వం మేము కండ్లారా చూచిన వారం.

[17] “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అంటే నాకెంతో ఆనందం” అనే ఆ స్వరం మహా దివ్య మహిమ స్థలంనుంచి ఆయనకు వినిపించినప్పుడు తండ్రి అయిన దేవుని చేత ఘనత, మహిమ ఆయనకు కలిగాయి.

[18] ఆయనతో కూడా మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పరలోకంనుంచి వచ్చిన ఆ స్వరం విన్నాం.

[19] ఇంతే కాదు, నిశ్చయమైపోయిన భవిష్యద్వాక్కు కూడా మనకు ఉంది. అది చీకటిలో వెలుగిస్తున్న దీపంలాంటిది. అరుణోదయమై వేకువచుక్క మీ హృదయంలో ఉదయించేవరకు ఆ వాక్కు ను మీరు పట్టించుకొంటే మీకు మేలు.

[20] అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి – లేఖనంలోని భవిష్యద్వాక్కుల్లో ఏదీ వ్యక్తిగత వివరణవల్ల అర్థం కాదు.

[21] ఎందుకంటే, భవిష్యద్వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మవశులై పలికారు.

2 పేతురు లేఖ — Chapters