Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:49

[1] కాబట్టి సమస్తమైన దుష్టభావం, వంచన, కపటం, అసూయ, దూషణ మాటలంతా విసర్జించండి.

[2] దేవుని వాక్కులోని ఆధ్యాత్మికమైన స్వచ్ఛమైన పాలవల్ల పెరిగేలా, కొత్తగా పుట్టిన బిడ్డల్లాగా దాన్ని ఆశిస్తూ ఉండండి.

[3] ప్రభువు దయగలవాడని మీరు రుచి చూశారు గదా.

[4] ఆయన సజీవమైన రాయి. ఆయనను మనుషులు వద్దన్నారు గానీ దేవుడు ఎన్నుకొన్నాడు, ప్రియంగా ఎంచాడు.

[5] ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి, యేసు క్రీస్తుద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశం.

[6] అందుచేత ఈ లేఖనంలో కూడా ఇది ఉంది, ఇదిగో, నేను ఎన్నుకొని ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సీయోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచినవాడు ఎన్నడూ కలవరానికి గురికాబోడు.

[7] నమ్మకముంచుతున్న మీకు ఈ “రాయి” ప్రియమైనది గానీ నమ్మకాన్ని నిరాకరించేవారి విషయమైతే ఈ మాట చెల్లుతుంది: “కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.”

[8] “ఆయన తగిలే రాయిగా, తొట్రుపాటు బండగా ఉంటాడు.” వారు వాక్కుకు అవిధేయులు గనుకనే తొట్రుపడుతున్నారు. ఇది వారికి నియమించిన విధి.

[9] మీరైతే ఎన్నికైన వంశం, పరలోక రాజుకు చెందిన యాజుల సమూహం, పవిత్ర జనం, దేవుని సొత్తయిన ప్రజ. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, చీకటిలోనుంచి తన అద్భుతమైన వెలుగులోకి మిమ్ములను పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు మీరు చాటించాలి.

[10] ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు. ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు కరుణ పొందనివారు. ఇప్పుడైతే కరుణ పొందినవారు.

[11] ప్రియ స్నేహితులారా, పరవాసులు, యాత్రికులై ఉండి శరీర స్వభావ దురాశలు విసర్జించండని మిమ్ములను వేడుకొంటున్నాను. అవి మీ ఆత్మలమీద యుద్ధం చేస్తాయి.

[12] ఇతర ప్రజలు మిమ్ములను దుర్మార్గులని దూషిస్తూ ఉంటే వారు మీ మంచి పనులు చూచి దైవదర్శన దినాన దేవుణ్ణి మహిమపరచాలని వారిమధ్య ఆకర్షణీయమైన ప్రవర్తన గలవారై ఉండండి.

[13] అందుచేత మనుషులలో నియమించిన ప్రతి అధికారానికీ ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందనీ

[14] ప్రాంతీయాధికారులు దుర్మార్గులను దండించడానికీ సన్మార్గులను మెచ్చుకోవడానికీ రాజు పంపినవారనీ వారికీ లోబడండి.

[15] ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా తెలివితక్కువగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తం.

[16] స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి గాని దేవుని బానిసలుగా బ్రతకండి.

[17] అందరిపట్ల గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవునిమీది భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి.

[18] ఇంటి దాసులారా, మీ యజమానులకు పూర్తి భయ మర్యాదలతో లోబడి ఉండండి. మంచివారికీ సాత్వికులకూ మాత్రమే కాకుండా వక్ర బుద్ధులకు కూడా అణిగి ఉండండి.

[19] ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవునిపట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకొంటే అది మెచ్చుకోదగిన సంగతి.

[20] తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకొంటే మీకేం కీర్తి? గానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకొంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదే.

[21] మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే గదా. ఎందుకంటే, క్రీస్తు సహా మనకోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు.

[22] ఆయన ఏమీ పాపం చేయలేదు. ఆయన నోట ఏమీ మోసం లేదు.

[23] దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు, బాధలకు గురి అయినప్పుడు బెదరించలేదు గాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకొన్నాడు.

[24] మనం పాపాల విషయంలో చనిపోయి నీతిన్యాయాలకోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది.

[25] ఎందుకంటే మీరు గొర్రెలలాగా త్రోవ తప్పిపోయారు గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా, పై విచారణకర్తగా ఉన్న ఆయన దగ్గరకు మళ్ళుకొని వచ్చారు.

1 పేతురు లేఖ — Chapters