Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:41

[1] అందుచేత, క్రీస్తు శరీరంలో మనకోసం బాధలు అనుభవించాడు గనుక అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో బాధలు అనుభవించినవాడు పాపం నుంచి విరమించుకొన్నాడు.

[2] ఈ శరీరంతో ఉన్న మిగతా కాలమంతా మానవ దురాశల కోసం కాదు గాని దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని అతని ఉద్దేశం.

[3] మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు.

[4] ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు.

[5] బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది.

[6] ఈ కారణంచేత చనిపోయినవారు శరీర విషయంలో మానవరీతిగా తీర్పు పొందేలా, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి బ్రతికేలా వారికి కూడా శుభవార్త ప్రకటించబడింది.

[7] అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది, గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో, మెళకువగా ఉండండి.

[8] ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమతో చూచుకోండి.

[9] ఏమీ సణుక్కోకుండా ఒకరినొకరు అతిథి మర్యాదలు చేసుకోండి.

[10] ప్రతి ఒక్కరూ తనకు ఇవ్వబడ్డ ఆధ్యాత్మిక వరం ఇతరులకు సేవ చేయడానికి దాన్ని వినియోగించాలి. దేవుని ఆయా విధాల కృప విషయంలో మంచి నిర్వాహకులుగా ఉండాలి.

[11] ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు పలికినట్టే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడిచ్చిన సామర్థ్యంతో అలా చేయాలి. అన్నిటిలో దేవునికి యేసు క్రీస్తు ద్వారా మహిమ కలగాలనే ఉద్దేశంతో ఉండాలి. ఆయనకే మహిమ, అధికారం యుగయుగాలకు చెందుతాయి. తథాస్తు!

[12] ప్రియ సోదరులారా, మీమధ్య వాటిల్లుతూ ఉన్న మంటల్లాంటి విపత్తు మిమ్ములను పరీక్షించడానికే. మీకేదో విపరీతం జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకండి.

[13] అయితే క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో ఉప్పొంగిపోయేలా ఇప్పుడు ఆయన బాధలలో మీరు పాలివారై ఉన్నంతగా ఆనందించండి.

[14] ఒకవేళ క్రీస్తు పేరుకోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీమీద నిలిచి ఉన్నాడన్నమాట. వారివైపున ఆయన దూషించబడుతున్నాడు, మీవైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది.

[15] కానీ మీలో ఎవరూ హంతకుడుగా గానీ దొంగగా గానీ దుర్మార్గుడుగా గానీ పరుల జోలికి పోయేవాడుగా గానీ బాధలు అనుభవించకూడదు.

[16] ఎవరైనా క్రైస్తవుడైనందుచేత బాధలు అనుభవించవలసివస్తే సిగ్గుపడకూడదు. అయితే ఈ విషయంలో దేవుణ్ణి కీర్తించాలి.

[17] దేవుని ఇంటివారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమయితే దేవుని శుభవార్తకు విధేయత చూపనివారి అంతం ఏమవుతుంది!

[18] న్యాయవంతునికే రక్షణ, విముక్తి కలగడం కష్టమైతే భక్తిహీనులూ పాపులూ ఎక్కడ కనిపిస్తారో!

[19] అందుచేత దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవిస్తున్నవారు మంచి చేస్తూ తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి.

1 పేతురు లేఖ — Chapters