Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:58

[1] ఇదిగో వినండి, ఆస్తిపరులారా! మీమీదికి వచ్చే కడగండ్లను గురించి రోదనం చేయండి, ఏడ్వండి!

[2] మీ ఆస్తి మురిగిపోయింది. మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టాయి.

[3] మీ వెండి బంగారాలకు తుప్పు పట్టింది. వాటి తుప్పు మీమీద విరుద్ధ సాక్ష్యం పలుకుతూ ఉండి నిప్పులాగా మీ శరీరాలను తినివేస్తుంది. మీరు ధనం పోగు చేసుకొన్నది చివరి రోజులలోనే!

[4] ఇదిగో వినండి. మీ పొలాల పంట కోసినవారికి మీరు కూలి ఇవ్వకుండా వంచనతో బిగబట్టారు. ఆ కూలి కేకలు వేస్తూ ఉంది. కోతవారి మొరలు సేనలప్రభువు చెవులకు చేరాయి.

[5] మీరు భూమిమీద సుఖంగా విలాసాసక్తితో బ్రతికారు. వధ సమయంలో ఉన్నట్టు మీ హృదయాలను కొవ్వబెట్టుకొన్నారు.

[6] న్యాయవంతుణ్ణి నేరస్థాపనకు గురి చేశారు, చంపారు. అతడు మిమ్ములను ఎదిరించినవాడు కాదు.

[7] అయితే సోదరులారా, ప్రభువు వచ్చేంతవరకు ఓర్పుతో ఉండండి. చూడండి, రైతు తొలకరి వాన, కడవరి వాన వచ్చేవరకు విలువైన ఫలసాయం కోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు.

[8] ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు కూడా ఓర్పుతో ఉండండి. మీ మనసులను దిటవు చేసుకోండి.

[9] సోదరులారా, మీకు శిక్షావిధి రాకుండా ఒకరిమీద ఒకరు సణుక్కోకండి. ఇదిగో వినండి, న్యాయమూర్తి తలుపుదగ్గరే నిలుచున్నాడు.

[10] నా సోదరులారా, కీడులకు గురి అయి ఓపికతో సహించే విషయంలో, ప్రభువు పేర పలికిన ప్రవక్తలను ఆదర్శంగా తీసుకోండి.

[11] సహించినవారిని ధన్యులని పరిగణిస్తున్నాం గదా. యోబు ఓర్పును గురించి మీరు విన్నారు. తుదకు ప్రభువు వల్ల కలిగిన ఫలితం – ప్రభువు కరుణామయుడు, ఎంతో జాలి గలవాడని చూశారు.

[12] నా సోదరులారా, చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఆకాశంతోడని గానీ భూమితోడని గానీ మరి దేనితోడని గానీ ఒట్టు పెట్టుకోకండి. మీమీదికి తీర్పు రాకుండా మీరు చెప్పేది అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేలా చేయండి.

[13] మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి.

[14] మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.

[15] నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.

[16] ఒకరితో ఒకరు మీ అతిక్రమాలు ఒప్పుకోండి. మీకు ఆరోగ్యం చేకూరేలా ఒకరికోసం ఒకరు ప్రార్థన చేయండి. న్యాయవంతుని ప్రార్థన పని చేయడంలో చాలా ప్రభావంగలది, ఫలవంతమైనది.

[17] ఏలీయా మనలాంటి స్వభావం గలవాడే. వాన కురియకూడదని అతడు మనసారా ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాలపాటు ఆ దేశంలో వాన పడలేదు.

[18] మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వాన కురిపించింది, భూమి దాని పంట ఇచ్చింది.

[19] సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తప్పిపోతే, మరొకరు ఆ వ్యక్తిని సత్యానికి మళ్ళిస్తే ఇది తెలుసుకోవాలి:

[20] పాపిని తన తప్పుదారినుంచి మళ్ళించేవాడు ఆ మనిషి ఆత్మను చావునుంచి రక్షించి విస్తారమైన పాపాలను కప్పివేస్తాడు.

యాకోబు లేఖ — Chapters