Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:12

[1] మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?

[2] ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.

[3] ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

[4] అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు. అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

[5] కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

[6] మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

[7] ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు.

[8] అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు? నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు.

[9] అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు. అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు.

[10] అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.

[11] తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.

[12] కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది. ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు.

యెషయా — Chapters