[1] వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ,
[2] తల్లిదండ్రులు లేని వాళ్ళను దోచుకోవాలనీ కోరి, అవసరతలో ఉన్న వాళ్లకు న్యాయం జరిగించకుండా చేసి, నా ప్రజల్లో ఉన్న పేదలకు హక్కులు లేకుండా చేసి, అన్యాయ నియమాలు విధించే వారికీ, బాధ కలిగించే శాసనాలు చేసే వారికీ బాధ.
[3] తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?
[4] నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
[5] అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.
[6] భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
[7] కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.
[8] అతను “నా అధిపతులందరూ మహారాజులు కారా?
[9] కల్నో పట్టణం కర్కెమీషులాంటిదే కదా? హమాతు అర్పాదులాంటిది కాదా? షోమ్రోను దమస్కులాంటిది కాదా?
[10] విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా, వాటి విగ్రహాలు యెరూషలేము, షోమ్రోనుల విగ్రహాల కంటే ఎక్కువే గదా.
[11] షోమ్రోను పట్ల, దాని విగ్రహాల పట్ల నేను చేసినట్టు యెరూషలేము పట్ల, దాని విగ్రహాల పట్ల చెయ్యకుండా ఉంటానా” అంటాడు.
[12] సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభువు తన కార్యమంతా నెరవేర్చిన తరువాత ఆయన “నేను అష్షూరు రాజు హృదయ గర్వం కారణంగా అతని మాటను బట్టి, అతని కళ్ళల్లోని అహంకారపు చూపులను బట్టి, అతన్ని శిక్షిస్తాను” అంటాడు.
[13] ఎందుకంటే అతడు, “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.
[14] పక్షిగూటిలో ఒకడు చెయ్యి పెట్టినట్టు దేశాల ఆస్తి చేజిక్కించుకున్నాను. విడిచిపెట్టిన గుడ్లను ఏరుకున్నట్టు నేను భూమంతా సంపాదించుకున్నాను. ఏ పక్షీ రెక్కలు ఆడించలేదు, నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు” అంటాడు.
[15] నరికేవాణ్ణి చూసి గొడ్డలి తన గురించి తాను ప్రగల్భాలు పలుకుతుందా? కోసేవాణ్ణి చూసి రంపం తన గురించి తాను పొగడుకుంటుందా? ఇది ఒక కర్ర తనను ఎత్తేవాణ్ణి పైకెత్తగలిగినట్టు ఉంది. ఒక గద ఒక వ్యక్తిని పైకి లేపగలిగినట్టు ఉంది.
[16] కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.
[17] ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.
[18] ఒకడు వ్యాధితో క్షీణించిపోయినట్టు శరీర ప్రాణాలతోపాటు అతని అడవికీ అతని ఫలభరితమైన పొలాలకూ కలిగిన మహిమను అది నాశనం చేస్తుంది.
[19] అతని అడవిచెట్ల లెక్క ఎంత తగ్గిపోతుందంటే, ఒక పసివాడు వాటిని లెక్కపెట్టగలుగుతాడు.
[20] ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
[21] యాకోబులో మిగిలిన వాళ్ళు బలవంతుడైన దేవునివైపు తిరుగుతారు.
[22] ఇశ్రాయేలూ, నీ ప్రజలు సముద్రపు ఇసుకలా ఉన్నా, దానిలో మిగిలిన వాళ్ళే తిరుగుతారు. ప్రవాహంలా పారే నీతి నిర్ణయించిన ప్రకారం ఆ దేశానికి సమూల నాశనం ప్రాప్తించింది.
[23] ఎందుకంటే ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భూమంతటా తాను నిర్ణయించిన సమూల నాశనం అమలు చెయ్యబోతున్నాడు.
[24] ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “సీయోనులో నివాసం ఉంటున్న నా ప్రజలారా, అష్షూరుకు భయపడవద్దు. ఐగుప్తీయులు చేసినట్టు వాళ్ళు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తమ దండం ఎత్తుతారు.
[25] అతనికి భయపడవద్దు. ఇంక కొద్ది కాలమైన తరువాత నీ మీద నా కోపం చల్లారుతుంది. నా కోపం అతని నాశనానికి దారి తీస్తుంది.”
[26] ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
[27] ఆ రోజున నీ భుజం మీద నుంచి అతని బరువు, నీ మెడ మీద నుంచి అతని కాడి తీసివేయడం జరుగుతుంది. నీ మెడ బలంగా ఉన్న కారణంగా ఆ కాడి నాశనం అవుతుంది.
[28] శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు, మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు. మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు.
[29] వాళ్ళు కొండ సందు దాటారు, గెబలో బస చేశారు. రమా వణకుతోంది. సౌలు గిబ్యా నివాసులు పారిపోయారు.
[30] గల్లీము ఆడపడుచులారా, బిగ్గరగా కేకలు వేయండి. లాయిషా, ఆలకించు! అయ్యయ్యో, అనాతోతు!
[31] మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గెబీము నివాసులు సురక్షిత ప్రాంతాలకు పరుగెత్తుతున్నారు.
[32] ఈ రోజే అతను నోబులో ఆగుతాడు. ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండవైపు వాళ్ళు తమ పిడికిలి ఊపుతున్నారు.
[33] చూడండి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా భీకర శబ్దంతో కొమ్మలను తెగగొట్టినప్పుడు ఎత్తయిన చెట్లు కూలిపోతాయి. గంభీరమైనవి పడిపోతాయి.
[34] ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతాడు. ప్రఖ్యాతిగాంచిన లెబానోను కూలిపోతుంది.