Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:08

[1] అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది.

[2] అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి.

[3] బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి.

[4] బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”

[5] గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి.

[6] కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.

[7] ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి.

[8] పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు.

[9] అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.

[10] నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.

యెషయా — Chapters