[1] చూడండి, సేనలకు అధిపతి, ప్రభువూ అయిన యెహోవా యెరూషలేము నుంచి, యూదా నుంచి దాని పోషణ, దాని ఆధారం తీసివేయబోతున్నాడు. దాని ఆహార సంబంధమైన ఆధారం, నీటి సరఫరా,
[2] శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు,
[3] సోదెగాళ్ళు, పెద్దలు, పంచ దశాధిపతులు, ఘనత వహించిన వాళ్ళు, మంత్రులు, శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు, మాంత్రికులు, అందరినీ యెరూషలేములోనుంచీ, యూదా దేశంలో నుంచి, తీసివేయబోతున్నాడు.
[4] “నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు.
[5] ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు.
[6] ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, ‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు.
[7] అతడు ఆ రోజున కేక వేసి, ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.”
[8] తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమయ్యింది.
[9] వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.
[10] నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు.
[11] దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు.
[12] చిన్న పిల్లలు నా ప్రజలను హింసిస్తారు. స్త్రీలు వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని మీ మార్గంలో అయోమయం పాలుచేసి తప్పు దోవ పట్టిస్తారు.
[13] తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు.
[14] యెహోవా తన ప్రజల పెద్దల మీద, వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. “మీరే ద్రాక్షతోటను తినేశారు. మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది.
[15] నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.
[16] యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు.
[17] కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల తలల మీద గజ్జి పుండ్లు పుట్టిస్తాడు. వాళ్ళ తలలు యెహోవా బోడి తలలుగా చేస్తాడు.
[18] ఆ రోజున ప్రభువు వాళ్ళ కాళ్ళ గజ్జెలు, శిరోభూషణాలూ, చంద్రవంక నాగరాలూ,
[19] చెవిపోగులూ, కడియాలూ, మేలి ముసుగులూ,
[20] తలకు కట్టుకునే పాగాలూ, కాళ్ల గొలుసులూ, ఒడ్డాణాలూ, పరిమళ ద్రవ్యపు భరిణెలూ,
[21] తాయెత్తులు, ఉంగరాలు, ముక్కు కమ్మలు,
[22] ఉత్సవ వస్త్రాలూ, ఉత్తరీయాలూ, పైటలూ, సంచులూ,
[23] చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, పాగాలు, శాలువాలు తీసేస్తాడు.
[24] అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, నడికట్టుకు బదులుగా తాడూ, అల్లిన జడకు బదులుగా బోడి తల, ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, అందానికి బదులు వాత ఉంటాయి.
[25] మనుషులు కత్తివాత కూలి పోతారు. యుద్ధంలో నీ శూరులు పడిపోతారు.
[26] యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.