Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:45

[1] నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.

[2] మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.

[3] యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.

[4] నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.

[5] నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.

[6] ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.

[7] సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.

[8] చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.

[9] యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?

[10] చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?

[11] యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.

[12] నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?

[13] ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?

[14] కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.

[15] నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.

[16] నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.

[17] యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.

[18] ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.

[19] రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?

[20] నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.

[21] అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.

[22] నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు.

[23] నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”

యెషయా — Chapters