Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:13

[1] ఆ రోజుల్లో హిజ్కియాకు ప్రాణాంతకమైన జబ్బు చేసింది. ప్రవక్త, ఆమోజు కొడుకు యెషయా అక్కడకు వచ్చాడు. “‘నువ్వు చనిపోబోతున్నావు, ఇక బతకవు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని యెహోవా సెలవిస్తున్నాడు” అని చెప్పాడు.

[2] అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి,

[3] “యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనేవిధంగా జీవించానో, సమస్తాన్నీ ఏ విధంగా నీ దృష్టికి మంచిదిగా జరిగించానో, కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.

[4] అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,

[5] “నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చేదేమంటే నీ కన్నీళ్లు నేను చూశాను. నీ ప్రార్థన అంగీకరించాను.

[6] నీ జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి విడిపించి కాపాడతాను.

[7] తాను పలికిన మాట నెరవేరుతుంది అనడానికి యెహోవా నీకిచ్చే సూచన ఇదే,

[8] ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి చేత ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు ఎక్కేలా చేస్తాను.’” అప్పుడు సూర్యకాంతిలో ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మళ్ళీ వెనక్కి జరిగింది.

[9] యూదారాజు హిజ్కియా జబ్బుపడి తిరిగి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించిన ప్రార్థన.

[10] “నా జీవితం సగభాగంలో నేను పాతాళ ద్వారం గుండా వెళ్ళాల్సివచ్చింది. మిగిలిన సగభాగం నేనిక కోల్పోయినట్టే.

[11] యెహోవాను, సజీవుల దేశంలో యెహోవాను చూడక పోయేవాణ్ణి. మృతుల లోకంలో పడిపోయి ఇక మనుషులకు కనిపించనేమో అనుకున్నాను.

[12] నా జీవం తీసేశారు. గొర్రెల కాపరి గుడిసెలాగా అది నా దగ్గర నుండి తీసివేశారు. నేతపనివాడు చేసినట్టు నా జీవితాన్ని చుట్టేస్తున్నాను. ఆయన నన్ను మగ్గం నుండి దూరం చేశాడు. ఒక్క రోజులోనే నువ్వు నా జీవితాన్ని ముగిస్తున్నావు.

[13] (ఉదయం దాకా ఓర్చుకున్నాను. సింహం లాగా నా ఎముకలన్నిటినీ విరిచేశాడు.) ఒక్క రోజులోనే నువ్వు నన్ను సమాప్తి చేస్తావు.

[14] ముళ్ళ తోక పిట్టలాగా కిచ కిచలాడాను. పావురం లాగా కూశాను. పైకి చూసీ చూసీ నా కళ్ళు అలసిపోయాయి. నలిగి పోయాను. యెహోవా, నాకు సహాయం చెయ్యి.

[15] నేనేమనగలను? ఆయన నా గురించి మాట పలికాడు, ఆయనే దాన్ని జరిగించాడు. నా హృదయంలో నిండి ఉన్న దుఃఖాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ తడబడుతూ గడిపేస్తాను.

[16] ప్రభూ, నీవు పంపిన బాధలు మనుషులకు మంచివే. వాటి వల్లనే నా ఆత్మ జీవిస్తున్నది. నువ్వు నన్ను బాగు చేసి నన్ను జీవింపజేశావు.

[17] ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు.

[18] ఎందుకంటే పాతాళంలో నీకు స్తుతి కలగదు. మరణం నీకు స్తుతి చెల్లించదు. సమాధిలోకి వెళ్ళినవారు నీ నమ్మకత్వంపై ఆశ పెట్టుకోరు.

[19] సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతిస్తారు! ఈ రోజున నేను సజీవుడిగా నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు తమ కొడుకులకు నీ సత్యాన్ని తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించేవాడు.

[20] నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో సంగీత వాయిద్యాలు వాయిస్తాను.”

[21] యెషయా “ఒక అంజూరు పండ్ల ముద్దను ఆ పుండుకు కట్టండి, అప్పుడు అతడు బాగుపడతాడు” అని చెప్పాడు.

[22] దానికి ముందు హిజ్కియా “నేను మళ్ళీ యెహోవా మందిరానికి వెళతాను అనేదానికి సూచన ఏమిటి?” అని అతణ్ణి అడిగాడు.

యెషయా — Chapters