Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:37

[1] ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.

[2] వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.

[3] ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.

[4] షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.

[5] ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.

[6] షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.

[7] ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[8] షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.

[9] ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.

[10] కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[11] ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

[12] కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.

[13] మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[14] కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.

[15] మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.

[16] యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[17] మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

[18] యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.

[19] హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[20] యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.

[21] హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.

[22] మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[23] హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.

[24] హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.

[25] మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.

[26] మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[27] మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.

[28] లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.

[29] “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.

[30] లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.

[31] లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.

[32] ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

ఆదికాండం — Chapters