Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:18

[1] దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.

[2] యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.

[3] మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.

[4] వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.

[5] వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.

[6] యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.

[7] అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.

[8] రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.

[9] యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.

[10] అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

[11] దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.

[12] నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.

[13] దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.

[14] దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.

[15] తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.

[16] వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.

[17] ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.

[18] రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

[19] ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.

[20] యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.

[21] ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.

[22] ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.

[23] యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.

[24] యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.

[25] రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.

[26] లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.

[27] అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.

[28] ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.

[29] ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.

ఆదికాండం — Chapters