Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:39

[1] యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.

[2] యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.

[3] రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.

[4] పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.

[5] షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.

[6] నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.

[7] వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.

[8] యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.

[9] యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?

[10] షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.

[11] ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.

[12] అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.

[13] జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.

[14] ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.

[15] అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.

[16] దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.

[17] దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.

[18] యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.

[19] దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.

[20] ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.

[21] నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.

[22] యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.

[23] విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.

[24] అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.

[25] నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.

[26] నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.

[27] బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”

[28] ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.

[29] తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.

[30] హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.

[31] అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.

[32] ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.

[33] యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.

ఆదికాండం — Chapters