[1] అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
[2] ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
[3] యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
[4] మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
[5] వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
[6] అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
[7] అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
[8] అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
[9] అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
[10] అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
[11] అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు.
[12] ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది.
[13] ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,
[14] మిష్మా, దూమానమశ్శా,
[15] హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
[16] ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.
[17] ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
[18] వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు.
[19] అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
[20] ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
[21] ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
[22] ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
[23] అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”
[24] ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
[25] మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
[26] తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
[27] ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
[28] ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
[29] యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
[30] ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.
[31] అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు.
[32] అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
[33] యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
[34] యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.