Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:39

[1] ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.

[2] అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.

[3] ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.

[4] నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”

[5] యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.

[6] యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.

[7] అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.

[8] ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.

[9] యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

[10] షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.

[11] లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.

[12] యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.

[13] ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.

[14] జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.

[15] వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.

[16] గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.

[17] ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.

[18] లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.

[19] యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.

[20] యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.

[21] బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.

[22] యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.

[23] దాను కొడుకు హుషీము.

[24] నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.

[25] లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.

[26] యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.

[27] ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.

[28] యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.

[29] యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.

[30] అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.

[31] యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు.

[32] వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను.

[33] కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే

[34] ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”

ఆదికాండం — Chapters