[1] యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
[2] భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు.
[3] జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు.
[4] ఏ మనిిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
[5] దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం
[6] కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.
[7] యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
[8] అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు.
[9] నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.
[10] ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.
[11] కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు.
[12] కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.
[13] కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు.
[14] ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.
[15] కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి.
[16] చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు.
[17] తన తండ్రిని ఎగతాళి చేసే మనిిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షించబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.
[18] నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి.
[19] ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న మగవాడు.
[20] తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.
[21] భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి.
[22] రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు,
[23] ద్వేషంతో పూర్తిగా నిండిపోయినా, ఒక భర్తను పొంద గలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, ఆ స్త్రీ మీద అధికారిణి అయిన దాసి.
[24] భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.
[25] చీమలు చిన్నవి, బలహీనమైనవి. కానీ అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసు కొంటాయి.
[26] కుందేలు చిన్న జంతువు. కానీ అది బండల్లో నివాసం ఏర్పాటు చేసు కోగలుగుతుంది.
[27] మిడతలకు రాజు లేడు. కానీ అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.
[28] బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కానీ అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.
[29] నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి.
[30] సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.
[31] చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు.
[32] నీవు తెలివితక్కువ వాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల పెడితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.
[33] ఒక మనిషి పాలను చిలికి వెన్న చేస్తాడు. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.