[1] ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.
[2] మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుని దోషిగా యెహోవా తీర్చు చెబుతాడు.
[3] దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.
[4] మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది.
[5] మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు.
[6] దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి.
[7] దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు.
[8] జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు.
[9] భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు.
[10] మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు.
[11] తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు.
[12] దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కానీ మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొ చ్చుకొనిపోయే బలం ఉంటుంది.
[13] దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కానీ మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు.
[14] ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది.
[15] బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కానీ జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు.
[16] బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు.
[17] ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కానీ ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది.
[18] ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.
[19] ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది.
[20] దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు.
[21] మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు.కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.
[22] అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
[23] చురుకైనవాడు తనకు తెలిసిన అన్నీ విషయాలూ చెప్పడు. కానీ బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు.
[24] కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది.
[25] చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు.
[26] మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి.
[27] బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కానీ కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి.
[28] నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.