Skip to content
Opens in a new window

[1] ద్రాక్షారసం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. మద్యము కొట్లాటలు పుట్టిస్తుంది. విపరీతమైన తాగుబోతు బుద్ధిహీనుడు.

[2] ఒక రాజు కోపం సింహగర్జనలా ఉంటుంది. నీవు రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు.

[3] ఏ బుద్ధిహీనుడైనా ఒక వివాదం మొదలు పెట్టగలడు. కనుక వివాదాలకు దూరంగా ఉండే మనిషిని గౌరవించాల్సిందే.

[4] సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు.

[5] ఒక మనిషి ఆలోచనలను నీవు చూడలేవు. అవి లోతైన నీళ్లలాంటివి. అయితే జ్ఞానముగలవాడు, ఒకరు ఏమి తలస్తున్నారో గ్రహించగలడు.

[6] చాలామంది మనుష్యులు నమ్మకంగా ఉన్నామని, నిండు ప్రేమతో ఉన్నామని చెబుతారు, కాని నిజంగా అలా ఉన్నవారిని కనుగొనడం చాలా కష్టం.

[7] ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు.

[8] రాజు కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేటప్పుడు దుర్మార్గాన్ని ఆయన స్వంత కళ్లతో చూడగలడు.

[9] ఒక మనిషి ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానినే చేస్తానని నిజంగా చెప్పగలడా? తనలో పాపం లేదని ఎవరైనా నిజంగా చెప్పగలరా? లేదు!

[10] అన్యాయపు తూనిక రాళ్లు, కొలతలు ఉపయోగించి ఇతరులను మోసం చేసే వాళ్లంటే యెహోవాకు అసహ్యం.

[11] ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన మంచి లేక చెడు చూపిస్తుంది. ఆ బిడ్డను నీవు గమనించి నిజాయితీ, మంచితనం ఆ బిడ్డకు ఉన్నాయో లేదో నీవు తెలిసికోవచ్చు.

[12] మనకు చూసేందుకు కళ్లు, వినేందుకు చెవులు ఉన్నాయి. వాటిని మన కోసం యెహోవా చేశాడు!

[13] నీవు నిద్రను ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.

[14] “నీవద్ద ఏదైనా కొనే మనిషి, బాగుండలేదు! చాలా ఖరీదు ఉంది!” అని చెబుతాడు. తరువాత అతడు వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా ఇతరులతో చెప్పుకొంటాడు.

[15] జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది.

[16] మరో మనిషి అప్పులకు నీవు బాధ్యత వహిస్తే నీవు నీ చొక్కా పోగొట్టుకొంటావు.

[17] దగాచేసి సంపాదించిన ఆహారము ఒక మనుష్యునికి తీపిగా వుంటుంది. కాని తర్వాత అతని నోరు మట్టితో నిండుతుంది. మోసం చేసి నీవు ఏదైనా సంపాదిస్తే అది మంచిదానిలా కనబడవచ్చు. కాని చివరికి దాని విలువ శూన్యం.

[18] నీవు పథకాలు వేయకముందు మంచి సలహా తీసికో. నీవు గనుక ఒక యుద్ధం ప్రారంభిస్తూంటే నిన్ను నడిపించేందుకు మంచి మనుష్యులను చూసుకో.

[19] ఇతరులను గూర్చి చెప్పుడు మాటలు చెప్పే మనిషి నమ్మదగిన వాడు కాడు. కనుక అధిక ప్రసంగం చేసే మనిషితో స్నేహంగా ఉండవద్దు.

[20] ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు.

[21] నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు.

[22] ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చేస్తే, నీ అంతట నీవే అతన్ని శిక్షించటానికి ప్రయత్నించకు. యెహోవా కోసం వేచి ఉండు. అంతంలో ఆయన నీకే విజయం ఇస్తాడు.

[23] అన్యాయపు త్రాసులు, తూనికలు ఉపయోగించి ఇతరులను మోసం చేసేవాళ్లంటే యెహోవాకు అసహ్యం. అవి ఆయన్ని సంతోషవరచవు.

[24] ప్రతి మనిషికీ ఏమి జరుగుతుంది. అనే విషయం నిర్ణయించేది యెహోవా, అలాంటప్పుడు ఎవరైనా సరే వారి జీవితంలో ఏమి జరుగుతుందో ఎలా గ్రహించగలరు?

[25] దేవునికి నీవు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేయక ముందే జాగ్రత్తగా ఆలోచించుకో, తర్వాత అలాంటి వాగ్దానం చేసి ఉండకపోతే మంచిది అనిపించవచ్చు.

[26] ఏ మనుష్యులు దుర్మార్గులో జ్ఞానముగల రాజు నిర్ణయిస్తాడు. మరియు ఆ ప్రజలను ఆ రాజు శిక్షిస్తాడు.

[27] ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు తెలిసికొనే సమర్ధుడు యెహోవా.

[28] ఒక రాజు న్యాయంగా, నిజాయితీగా ఉంటే, అతడు తన అధికారాన్ని ఉంచుకోగలుగుతాడు. ప్రజలు అతన్ని ప్రేమిస్తే, అతడు తన పరిపాలన కొనసాగిస్తాడు.

[29] ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కానీ నెరసిన తలను చూచి ఒక వృద్ధుని మనం గౌరవిస్తాం అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది.

[30] మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు.

సామెతలు — Chapters