Skip to content
Opens in a new window

[1] నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో.

[2] నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి.

[3] ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో.

[4] అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు.

[5] పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు.

[6] నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.

[7] నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు.

[8] నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.

[9] నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము.

[10] అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.

[11] నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు.

[12] ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.

[13] జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు.

[14] జ్ఞనము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారు కంటే మేలు.

[15] జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు!

[16] జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాలు, ఘనతలను నీకు ఇస్తుంది.

[17] జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు.

[18] జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.

[19] భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు.

[20] నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి.

[21] నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు.

[22] జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి.

[23] అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు.

[24] నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిదప్రశాంతంగా ఉంటుంది.

[25] నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి.

[27] మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము.

[28] నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు.

[29] నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.

[30] మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు.

[31] కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు.

[32] ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు.

[33] దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.

[34] ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.

[35] జ్ఞానముగల మనుష్యులు దేవుని వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.

సామెతలు — Chapters