Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:38

[1] యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు.

[2] తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి.

[3] ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు.

[4] తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి.

[5] అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.

[6] యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.

[7] అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని.

[8] నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు.

[9] నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి.

[10] దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.

[11] “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని.

[12] కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి.

[13] అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.

[14] “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను.

[16] ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు.

[17] నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.

[18] నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”

[19] ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి.

[20] చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.

[21] కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.

[22] ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది.

[23] అది చలికాలం. యేసు మందిరావరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు.

[24] వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.

[25] యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు.

[26] కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు.

[27] నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి.

[28] వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు.

[29] వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు.

[30] నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.

[31] యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు.

[32] కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అన్నాడు.

[33] యూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తున్నందుకు. మనిషివై దేవుణ్ణి అని అంటున్నందుకు నిన్ను చంపదలచాము” అని అన్నారు.

[34] యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, ‘మీరు దేవుళ్ళని’ దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది.

[35] మీ ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు.

[36] తండ్రి నన్ను ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఆ ప్రపంచంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణ్ణి అని అనటం ఆయన్ని దూషించటం ఎట్లా ఔతుంది?

[37] నేను, నా తండ్రి కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించకండి.

[38] నేను నా తండ్రి కార్యాన్ని చేసాను. కనుక మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యన్ని విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది” అని అన్నాడు.

[39] ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

[40] యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండిపొయ్యాడు. ఇదివరలో యోహాను బాప్తిస్మము నిచ్చింది ఇక్కడే.

[41] అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

[42] అక్కడ అనేకులు యేసును విశ్వసించారు.

యోహాను సువార్త — Chapters