[1] నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు.
[2] అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.
[3] యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.
[4] నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.
[5] యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు.
[6] మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది.
[7] అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు.
[8] గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.
[9] “అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.
[10] యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా?
[11] ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు.
[12] నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు?
[13] పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.
[14] “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.
[16] దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం.
[17] దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.
[18] తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.
[19] దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రేమించారు.
[20] చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు.
[21] మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు.
[22] ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు.
[23] అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు.
[24] ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.
[25] పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది.
[26] వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
[27] యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు.
[28] నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం.
[29] పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది.
[30] ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.
[31] “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు.
[32] ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు.
[33] దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు.
[34] ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు.
[35] తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు.
[36] ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.