[1] బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు.
[2] ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.
[3] ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
[4] యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కులుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు.
[5] యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది.
[6] లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి,
[7] ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
[8] వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
[9] యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు.
[10] రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
[11] ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
[12] ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు.
[13] యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
[14] అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
[15] నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
[16] దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
[17] యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది.
[18] బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది.
[19] చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
[20] యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
[21] మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు.
[22] కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
[23] యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
[24] మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
[25] యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు.
[26] జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
[27] ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
[28] ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది.
[29] మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.
[30] యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు.
[31] మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు.
[32] మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.
[33] ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది.
[34] “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
[35] యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
[36] అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.
[37] కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.
[38] యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది.
[39] “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది.
[40] అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.
[41] వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి.
[42] నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు.
[43] ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు.
[44] చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.
[45] మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు.
[46] కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు.
[47] అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు.
[48] అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
[49] వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు.
[50] అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
[51] యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
[53] ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు.
[54] అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
[55] యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు.
[56] అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.
[57] ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.