Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:15

[1] వ్రాసిన మొదటి లేఖ దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొసైవేసు నుండి.

[2] కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగుగాక!

[3] మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక!

[4] యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను.

[5] మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు.

[6] క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది.

[7] మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు.

[8] మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు.

[9] తన కుమారుడును, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.

[10] సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.

[11] నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయెకుటుంబం నాకు తెలియ చేసింది.

[12] నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నానని” ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” అంటున్నారు.

[13] అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపైచనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా?

[14] నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.

[15] కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు.

[16] ఔను, నేను సైఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు.

[17] ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.

[18] ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.

[19] దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”

[20] మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!

[21] తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.

[22] యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.

[23] మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపిస్తుంది.

[24] కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకాని వాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము.

[25] దేవునికి అవివేకంలా కనిపించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.

[26] సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.

[27] కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.

[28] ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.

[29] తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం.

[30] కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు.

[31] అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”

కొరింథీయులకు పాసిన మొదటి తేఖ — Chapters