Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:44

[1] కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది.

[2] దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరిట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.

[3] నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి.

[4] వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కాని వాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.

[5] వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి. ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మిన వాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనైటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.

[6] మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.

[7] నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకును, యూనీయకును నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.

[8] ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి.

[9] మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానును, నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి.

[10] అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి.

[11] హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి. ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి.

[12] ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి. మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.

[13] ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.

[14] అసుంక్రీతును, ప్లెగోనును, హర్మేను, పత్రొబను, హెర్మాను, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.

[15] పిలొలొగును, యూలియా అనే సోదరిని, నేరియను, అతని సోదరిని, ఒలుంపాను వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.

[16] మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

[17] సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించే వాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించే వాళ్ళను, మీరు నేర్చకొన్న వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి.

[18] అలాంటి వాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు.

[19] మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!

[20] శాంతి దాత అయినటువంటి దేవుడు త్వరలోనే సైతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు. మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!

[21] నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు.

[22] పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

[23] మొత్తం సంఘానికి, నాకు, ఆతిథ్యమిస్తున్న గాయియు, మీకు వందనాలు చెపుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు.

[24] నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం.

[26] కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరించాలని అమరుడైన దేవుని ఆదేశానుసారం అన్ని దేశాలకు ఆ రహస్యం తెలుపబడింది.

[27] సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసు క్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక! ఆమేన్.

రోమీయులకు వ్రాసిన లేఖ — Chapters