Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:52

[1] ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది.

[2] తనలో జ్ఞానముందని భావిస్తున్న వానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు.

[3] కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.

[4] ఇక విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు.

[5] దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు.

[6] అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.

[7] కాని ఈ విషయం తెలియని వాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు.

[8] ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.

[9] కాని మీ నిర్ణయము, దృఢ విశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి.

[10] ఈ విషయంపై గట్టి అభిప్రాయంలేని వాడొకడు, ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది.

[11] బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ “అజ్ఞానం” వల్ల ఆ సోదరుడు నశిస్తాడు.

[12] అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు.

[13] నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.

కొరింథీయులకు పాసిన మొదటి తేఖ — Chapters