Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:45

[1] ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.

[2] నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి.

[3] నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.

[4] ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు.

[5] దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు.

[6] ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది.

[7] ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.

[8] దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నిశించి పోదు.

[9] ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది.

[10] అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.

[11] నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను.

[12] ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది.

[13] అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.

కొరింథీయులకు పాసిన మొదటి తేఖ — Chapters