Skip to content
Opens in a new window
Listen to this chapter • 10:14

[1] సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

[2] నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.

[3] నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు.

[4] లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతి పెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు.

[5] పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు.

[6] ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు.

[7] ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు.

[8] చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.

[9] ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను.

[10] కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది.

[11] నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.

[12] కాని మేము, క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయిన వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు?

[13] అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది.

[14] క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృధా అయినట్లే కదా!

[15] అంతే కాదు దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలాకాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు.

[16] ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు.

[17] క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట.

[18] అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట.

[19] మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.

[20] కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డ వాళ్ళలో ఆయన ప్రథముడు.

[21] ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది.

[22] ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరిణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు.

[23] ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడతారు.

[24] అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు.

[25] ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి.

[26] చివరి శతృవైన మృత్యువు నాశనము చేయబడుతుంది.

[27] ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు.

[28] కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు.

[29] పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయిన వాళ్ళ కోసం, బాప్తిస్మము పొందిన వాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయిన వాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు.

[30] మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం?

[31] సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను.

[32] ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.”

[33] మోసపోకండి, “చెడు సహవాసం మంచి వాణ్ణి చెడుపుతుంది.”

[34] మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు.

[35] కొందరు, “చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు.

[36] ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు.

[37] నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు.

[38] దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు.

[39] మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం.

[40] ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు.

[41] సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.

[42] చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు.

[43] గౌరవం లేని శరీరంగా నాటబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి శక్తిగల శరీరముగా లేస్తుంది.

[44] భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది.

[45] ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.”

[46] ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది.

[47] మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు.

[48] భూమ్మీద ఉన్న వాళ్ళు మట్టితో సృష్టింపబడిన వానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు పరలోకంనుండి వచ్చిన వానివలె ఉన్నారు.

[49] మట్టితో సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లే పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా మనము పొందుతాము.

[50] సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు.

[51] మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు.

[52] చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది.

[53] ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి.

[54] ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”

[55] “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ? ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”

[56] మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి పొందుతుంది.

[57] కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.

[58] కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృధాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.

కొరింథీయులకు పాసిన మొదటి తేఖ — Chapters