Skip to content
Opens in a new window

[1] ఏడో నెలలో, ఇస్రాయేల్ ప్రజలు తమ ఊళ్ళలో కాపురమేర్పరచుకొన్న తరువాత, వారంతా ఏకంగా వచ్చి “నీళ్ళ” ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఆదేశించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెమ్మని ధర్మశాస్త్రి అయిన ఎజ్రాతో చెప్పారు.

[2] ఏడో నెల మొదటి రోజున ఎజ్రాయాజి ఆ సభ ముందుకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు వచ్చాడు. ఆ సభలో స్త్రీ పురుషులు, గ్రహింపుతో వినగలవారందరూ ఉన్నారు.

[3] “నీళ్ళ” ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానం ముందు నిలుచుండి, ఎజ్రా ఉదయంనుంచి మధ్యాహ్నంవరకు ఆ స్త్రీ పురుషులకూ, గ్రహింపుతో వినగలవారందరికీ చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలంతా ధర్మశాస్త్ర గ్రంథవాక్కులను శ్రద్ధతో విన్నారు.

[4] ఆ పనికోసం చెక్కలతో చేసిన ఒక వేదిక మీద ఎజ్రా ధర్మశాస్త్రి నిలబడ్డాడు. అతని కుడిప్రక్కన మత్తితయా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా నిలుచున్నారు; అతని ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేల్, మల్కీయా, హాషుం, హష్‌బద్దానా, జెకర్యా, మెషుల్లాం నిలుచున్నారు.

[5] ఎజ్రా ఆ గ్రంథాన్ని విప్పాడు. అతడు అందరికంటే పైగా నిలబడి ఉండడం చేత ప్రజలు అతణ్ణి చూడగలిగారు. అతడు గ్రంథాన్ని విప్పగానే వారంతా నిలబడ్డారు.

[6] ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించాడు, ప్రజలందరూ చేతులెత్తి, “తథాస్తు! తథాస్తు!” అని చెప్పి యెహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశారు.

[7] ప్రజలు ఆ స్థలంలో నిలిచి ఉండగా లేవీగోత్రికులైన యేషూవ, బానీ, షేరేబయా, యామీను, అక్కూబ్, షబ్బెతయి, హోదీయా, మయశేయా, కెలీటా, అజరయా, హానాను, యోజాబాదు, పెలాయా ధర్మశాస్త్రోపదేశాలను వారికి వివరించి చెప్పారు.

[8] వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి, ప్రజలు గ్రహించేలా దాని అర్థం తెలియచెప్పారు.

[9] ధర్మశాస్త్ర వాక్కులను విని ప్రజలందరూ ఏడ్వసాగారు. అప్పుడు అధిపతి అయిన నెహెమ్యా, యాజీ ధర్మశాస్త్రీ అయిన ఎజ్రా, ప్రజలకు ఉపదేశిస్తున్న లేవీగోత్రికులు అందరితో ఇలా అన్నారు: “మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు. ఈ దినం మీ దేవుడు యెహోవాకు పవిత్ర దినం.”

[10] అప్పుడతడు “పదండి, క్రొవ్విన మాంసం తినండి, తియ్యనిదానిని తాగండి. తమకోసం ఏమీ సిద్ధం చేసుకోనివారికి వంతులు పంపండి. ఈ రోజు మన ప్రభువుకు పవిత్రమైనది. మీరు దుఃఖపడకండి. యెహోవా యందు ఆనందం మీకు బలం” అని చెప్పాడు.

[11] లేవీగోత్రికులు కూడా ప్రజలందరినీ నెమ్మదిపరచి “ఊరుకోండి, దుఃఖపడవద్దండి. ఇది పవిత్ర దినం” అన్నారు.

[12] అప్పుడు ప్రజలందరూ అన్నపానాలు పుచ్చుకోవడానికీ, లేనివారికి వంతులు పంపడానికీ మహానందంతో ఉత్సవం చేయడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే, తమకు తెలియజేసిన వాక్కులు వారు గ్రహించారు.

[13] రెండో రోజున ప్రజలలో అన్ని వంశాల నాయకులు, యాజులు, లేవీగోత్రికులు ధర్మశాస్త్ర వాక్కులను వినడానికి ఎజ్రా ధర్మశాస్త్రి దగ్గర సమకూడారు.

[14] ఏడో నెలలో జరిగే పండుగ సమయం ఇస్రాయేల్ ప్రజలు పర్ణశాలల్లో గడపాలని యెహోవా మోషేద్వారా ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్నట్టు వారు చూశారు.

[15] అందుచేత వారు ప్రకటన చేసి తమ ఊళ్ళన్నిటిలో, జెరుసలంలో ఇలా చాటించారు. “మీరు కొండలకు వెళ్ళి ఆలీవ్‌చెట్ల కొమ్మలను, అడవి ఆలీవ్‌చెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్లకొమ్మలను తెచ్చి, లేఖనం ప్రకారం పర్ణశాలలు కట్టాలి.”

[16] అలాగే ప్రజలు వెళ్ళి కొమ్మలను తెచ్చి, ఒక్కొక్కరు తమ ఇండ్ల పైకప్పులమీద, తమ ఆవరణాలలో, దేవాలయం ఆవరణంలో, “నీళ్ళ” ద్వారం దగ్గర ఉన్న మైదానంలో, “ఎఫ్రాయిం” ద్వారం దగ్గర మైదానంలో పర్ణశాలలు కట్టారు.

[17] చెరనుంచి తిరిగి వచ్చిన వారంతా పర్ణశాలలు కట్టి, వాటిలో ఉండిపోయారు. నూను కొడుకు యెహోషువ రోజులనుంచి ఆ రోజువరకు ఇస్రాయేల్ ప్రజలు ఆవిధంగా చేయలేదు. ఇప్పుడు వారి సంతోషం చాలా గొప్పది.

[18] ఆ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ ఎజ్రా, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. వారు ఆ పండుగ ఏడు రోజులు ఆచరించారు. న్యాయనిర్ణయాల ప్రకారం ఎనిమిదో రోజున పవిత్ర సభ జరిగింది.

నెహెమ్యా — Chapters