Skip to content
Opens in a new window

[1] షయల్‌తీయేల్ కొడుకు జెరుబ్బాబెల్ తో, యేషూవతో కూడా వచ్చిన యాజులూ లేవీ గోత్రికులూ వీరు: శెరాయా, యిర్మీయా, ఎజ్రా

[2] అమరయా, మళ్ళూకు, హట్టుషు,

[3] షెకనయా, రెహూ, మెరేమోతు,

[4] ఇద్దో, గిన్నెతోను, అబీయా,

[5] మీయామీను, మయదయా, బిల్గా,

[6] షెమయా, యోయారీబ్, యెదాయా,

[7] సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యేషూవ రోజులలో వారు యాజులలో, వారి బంధువులలో నాయకులు.

[8] లేవీగోత్రికులు వీరు: యేషూవ, బిన్నూయి, కద్‌మీయేల్, షేరేబ్యా, యూదా, మత్తనయా (మత్తనయా అతని బంధువులతోకూడా కృతజ్ఞతా సంకీర్తన కార్యక్రమం జరిగించేవాడు).

[9] వారి బంధువులు బక్‌బుకయా, ఉన్నీ ఆరాధన సభలలో వారికి ఎదురుగా నిలబడేవారు.

[10] యేషూవకు యోయాకీం జన్మించాడు, యోయాకీంకు ఎల్‌యాషీబు జన్మించాడు, ఎల్‌యాషీబుకు యోయాదా జన్మించాడు.

[11] యోయాదాకు యోనాతాను జన్మించాడు. యోనాతానుకు యద్దూవ జన్మించాడు.

[12] యోయాకీం రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజులెవరంటే, శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హననయా;

[13] ఎజ్రా కుటుంబానికి మెషుల్లాం; అమరయా కుటుంబానికి యెహోహానాను;

[14] మళ్ళూకు కుటుంబానికి యోనాతాను; షెబన్యా కుటుంబానికి యోసేపు;

[15] హారిం కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి;

[16] ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాం;

[17] అబీయా కుటుంబానికి జిక్రీ; మిన్‌యామీను కుటుంబానికీ మోపదయా కుటుంబానికి పిల్‌టయి;

[18] బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను;

[19] యోయారీబు కుటుంబానికి మత్తెనయి; యెదాయాల కుటుంబానికి ఉజ్జీ;

[20] సల్లయి కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు;

[21] హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేల్.

[22] ఎల్‌యాషీబు, యోయాదా, యోహానాను, యద్దూవ రోజుల్లో లేవీగోత్రికుల కుటుంబాల నాయకుల పేర్లూ, యాజుల పేర్లూ పారసీకదేశంవాడైన దర్యావేషు పరిపాలన కాలంలో నమోదయ్యాయి.

[23] ఎల్‌యాషీబు కొడుకు యోహానాను రోజులవరకు లేవీ కుటుంబాల నాయకుల పేర్లు ‘విషయాల గ్రంథం’లో నమోదయ్యాయి.

[24] లేవీగోత్రికుల నాయకులు వీరు: హషబ్యా, షేరేబ్యా, కద్‌మీయేల్ కొడుకు యేషూవ. దేవుని మనిషి అయిన దావీదు ఆదేశించినట్లు, వారూ, వారికి ఎదురుగా నిలబడే వారి సాటివారూ వంతుల ప్రకారం కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి నియమించబడ్డారు.

[25] మత్తనయా, బక్‌బుకయా, ఓబద్యా, మెషుల్లాం, టల్‌మోను, అక్కూబ్ ద్వారపాలకులు, ద్వారాల దగ్గరఉన్న గిడ్డంగులకు కాపలాదారులు.

[26] వారు యోజాదాక్ మనుమడూ యేషూవ కొడుకు అయిన యోయాకీం రోజుల్లో, అధిపతి అయిన నెహెమ్యా రోజుల్లో, యాజీ ధర్మశాస్త్రీ అయిన ఎజ్రా రోజుల్లో సేవ చేసేవారు.

[27] జెరుసలం ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం జరిగినప్పుడు, లేవీగోత్రికులు ఆ ప్రతిష్ఠాచారాన్ని కృతజ్ఞతా కీర్తనలతో, పాటలతో, చేతాళాలతో, వేరు వేరు తంతివాద్యాలతో సంతోషంగా జరిగించాలని వారు ఉంటున్న ప్రతి స్థలంనుంచీ జెరుసలంకు వారిని రప్పించడం జరిగింది.

[28] గాయకులను జెరుసలం చుట్టూరా ఉన్న ప్రాంతం నుంచి, నెటోపాతి వాళ్ళ గ్రామలనుంచి,

[29] బేత్‌గిల్గాల్ నుంచి, గెబ, అజ్‌మావెతు చుట్టూఉన్న ప్రాంతాలనుంచి సమకూర్చడం జరిగింది. (గాయకులు తమకోసం ఊళ్ళను జెరుసలం పరిసరాలలో కట్టేవారు.)

[30] యాజులూ లేవీగోత్రికులూ తమను శుద్ధి చేసుకొన్న తరువాత ప్రజలనూ ద్వారాలనూ గోడనూ శుద్ధి చేశారు.

[31] ఆ తరువాత యూదావారి నాయకులను గోడమీదికి ఎక్కేలా నేను చేశాను. స్తుతిపాటలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా చేశాను. ఒక గుంపువారు కుడి ప్రక్కను ‘పెంట’ ద్వారం వైపుకు గోడమీద నడిచారు.

[32] హోషయా, యూదావారి నాయకులలో సగంమంది వారిని వెంబడించారు.

[33] వీరు కూడా వారి వెంబడి వెళ్ళారు. అజరయా, ఎజ్రా, మెషుల్లాం,

[34] యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా,

[35] యాజులలో బూరలను చేతపట్టుకొని ఉన్న కొంతమంది, షెమయా మనుమడూ యోనాతాన్ కొడుకూ అయిన జెకర్యా (షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు, మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు ఆసాపు కొడుకు),

[36] అతని బంధువులు షెమయా, అజరేల్, మిలలయి, గిలలయి, మయ్యి, నేతనేల్, యూదా, హనానీ. దేవుని మనిషి అయిన దావీదు నియమించిన వాద్యాలను వాయిస్తూ వారు సాగారు. వారి ముందర ఎజ్రా ధర్మశాస్త్రి నడిచాడు.

[37] వారు ‘ఊట’ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు, దావీదు నగరానికి పోయే మెట్ల మీద దావీదు భవనాన్ని దాటి, తూర్పుగా ఉన్న ‘నీళ్ళ’ ద్వారం వరకు గోడ వెంబడి నడిచివెళ్ళారు.

[38] స్తుతిపాటలు పాడేవారి రెండో గుంపు ఎడమ వైపు నడచిపోయింది. వారి వెంబడి నేనూ, గోడమీద ఉన్న వారిలో సగంమందీ వెళ్ళాం. మేము అగ్నిగుండాల గోపురాన్ని దాటి వెడల్పు గోడవరకు వెళ్ళాం.

[39] ఆ గుంపువారు ‘ఎఫ్రాయిం’ ద్వారం మీదుగా వెళ్ళి, పాత ద్వారాన్ని, ‘చేపల’ ద్వారాన్ని, హనన్యేల్ గోపురాన్ని, శత గోపురాన్ని దాటిపోయి, ‘గొర్రెల’ ద్వారం వరకు వెళ్ళి, ‘కావలి’ ద్వారం దగ్గర ఆగిపోయారు.

[40] అప్పుడు, స్తుతిపాటలు పాడేవారి రెండు గుంపులూ, నేనూ, నాతో కూడా అధికారులలో సగంమంది దేవుని ఆలయానికి చేరి నిలిచాం.

[41] యాజులు కూడా అక్కడ ఉన్నారు. ఎల్‌యాకీం, మయశేయా, మిన్‌యామీను, మీకాయా, ఎల్‌యోయేనయి, జెకర్యా, హననయా బూరలు చేత పట్టుకొని ఉన్నారు.

[42] మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాం, ఏజెరు కూడా అక్కడ ఉన్నారు. ఇజ్రహయా నడిపిస్తూఉంటే గాయకులు పాడారు.

[43] ఆ రోజు దేవుడు వారికి మహానందం కలిగించాడు గనుక వారు మహా యజ్ఞాలను సమర్పించి సంతోషించారు. స్త్రీలూ పిల్లలూ కూడా సంతోషించారు. జెరుసలంలో పుట్టిన ఆనంద ధ్వనులు చాలా దూరానికి వినబడ్డాయి.

[44] ఆ కాలంలో, ప్రజలు ఇచ్చే పదార్థాలనూ ప్రథమ ఫలాలనూ పదో భాగాలనూ కూడబెట్టిన గిడ్డంగులమీద కొందరిని నియమించడం జరిగింది. ధర్మశాస్త్రం యాజులకోసం, లేవీగోత్రికులకోసం నిర్ణయించిన భాగాలను ఊళ్ళచుట్టు ఉన్న పొలాలనుంచి ఆ గిడ్డంగులకు తేవడానికి వారు నియమితమైన వారు. సేవ చేసే యాజులూ లేవీగోత్రికులూ అంటే యూదావారికి సంతోషమే.

[45] దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్లు వారు, గాయకులు ద్వారపాలకులతోపాటు, తమ దేవునికి సేవ చేస్తూ, శుద్ధి ఆచారాన్ని పాటిస్తూ ఉండేవారు.

[46] చాలాకాలం క్రిందట దావీదు, ఆసాపు రోజుల్లో గాయకులను స్తుతిపాటల విషయం, దైవసంకీర్తనం విషయం నడిపించేవారు ఉన్నారు.

[47] జెరుబ్బాబెల్ కాలంలో, నెహెమ్యా కాలంలో, ఇస్రాయేల్ వారందరూ గాయకులకూ ద్వారపాలకులకూ ప్రతిరోజూ ఇవ్వవలసిన భోజన పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీ గోత్రికులకోసం కూడా ఒక భాగాన్ని ప్రత్యేకించారు. లేవీగోత్రికులు అహరోను వంశంవారికి ఒక భాగాన్ని ప్రత్యేకించారు.

నెహెమ్యా — Chapters