[1] గోడ పూర్తి అయింది. నేను ద్వారాల తలుపులు నిలిపిన తరువాత ద్వారపాలకులనూ గాయకులనూ లేవీ గోత్రికులనూ నియమించాను.
[2] అప్పుడు నా తోబుట్టువు హనానీకీ, కోటకు అధిపతి హనన్యాకూ జెరుసలంమీద అధికారం ఇచ్చాను. హనన్యా నిజాయితీపరుడు, దేవునిపట్ల అనేకులకంటే ఎక్కువ భయభక్తులు గలవాడు.
[3] నేను వారికి ఆదేశించాను: “పొద్దు బాగా ఎక్కేవరకు జెరుసలం ద్వారాల తలుపులు తీయకూడదు. ద్వారపాలకులు వెళ్ళకముందు తలుపులు మూసి అడ్డగడియలు వేయాలి. అంతేగాక, జెరుసలం కాపురస్థులలో కొంతమందిని కాపలాదారులుగా నియమించి కావలి స్థలాలలో గానీ తమ ఇండ్లకు ఎదురుగా గానీ ఉంచండి.”
[4] జెరుసలం నగరం విశాలంగా, పెద్దగా ఉంది గాని దానిలో ఉన్నవారు కొద్దిమందే. ఇండ్లను ఇంకా కట్టడం జరగలేదు కూడా.
[5] అప్పుడు నాయకులనూ అధికారులనూ ప్రజలందరినీ సమకూర్చి, వంశాలప్రకారం జనాభా లెక్క వ్రాయాలని దేవుడు నా మనసులో తలంపు పుట్టించాడు. మొట్టమొదట తిరిగి వచ్చినవారి గురించిన వంశావళి గ్రంథం నేను కనుగొన్నాను. అందులో ఇలా వ్రాసి ఉంది.
[6] బబులోను రాజైన నెబుకద్‌నెజరు బందీలుగా తీసుకుపోయినవారి సంతానం అనేకులు బబులోనులో చెరనుంచి జెరుసలంకు, యూదాకు, ఎవరి ఊరికి వారు తిరిగి వచ్చారు.
[7] వారిలో జెరుబ్బాబెల్, యేషూవ, నెహెమ్యా, అజరయా, రయమయా, నహమానీ, మొర్‌దకయి, బిల్‌షాను, మిస్పెరేతు, బిగ్‌వయి, నెహూం, బయనా ఉన్నారు. బబులోను నుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల లెక్క ఇది:
[8] పరోషు వంశంవారు రెండు వేల నూట డెబ్భై ఇద్దరు;
[9] షెపట్య వంశం వారు మూడు వందల డెబ్భయి ఇద్దరు;
[10] అరహు వంశం వారు ఆరు వందల యాభై ఇద్దరు;
[11] యేషూవ, యోవాబుల వంశాలలో పహత్ మోయాబు కుటుంబంవారు రెండు వేల ఎనిమిది వందల పద్ధెనిమిది మంది;
[12] ఏలాం వంశం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు;
[13] జత్తూవంశం వారు ఎనిమిది వందల నలభై అయిదు మంది;
[14] జక్కయి వంశం వారు ఏడు వందల అరవైమంది;
[15] బిన్నూయి వంశం వారు ఆరు వందల నలభై ఎనిమిదిమంది;
[16] బేబయి వంశం వారు ఆరువందల ఇరవై ఎనిమిదిమంది;
[17] అజ్‌గాదు వంశంవారు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరు;
[18] అదోనీకాం వంశం వారు ఆరు వందల అరవై ఏడుమంది;
[19] బిగ్‌వయి వంశంవారు రెండువేల అరవై ఏడుమంది;
[20] అదీను వంశం వారు ఆరువందల యాభై అయిదు మంది;
[21] హిజ్కియా వంశంవారిలో అటేరు కుటుంబంవారు తొంభై ఎనిమిదిమంది;
[22] హాషూం వంశంవారు మూడు వందల ఇరవై ఎనిమిది మంది;
[23] బేజయి వంశంవారు మూడు వందల ఇరవై నలుగురు;
[24] హారీపు వంశంవారు నూట పన్నెండుమంది;
[25] గిబియోను వంశంవారు తొంభై అయిదుమంది;
[26] బేత్‌లెహేంకు చెందిన వంశాలవారు, నెటోపా గ్రామం వారు నూట ఎనభై ఎనిమిది మంది;
[27] అనాతోతు గ్రామం వారు నూట ఇరవై ఎనిమిదిమంది;
[28] బేత్ అజ్‌మావెతు గ్రామం వారు నలభై ఇద్దరు;
[29] కిర్యత్ యారీం, కెఫీరా, బేరోతు అనే గ్రామాల వారు ఏడు వందల నలభై ముగ్గురు;
[30] రమా, గెబ అనే గ్రామాల వారు ఆరువందల ఇరవై ఒక్కరు;
[31] మిక్‌మషు గ్రామం వారు నూట ఇరవై ఇద్దరు;
[32] బేతేల్, హయీ అనే గ్రామాల వారు నూట ఇరవై ముగ్గురు;
[33] ఇంకొక నెబో గ్రామం వారు యాభై ఇద్దరు;
[34] ఇంకొక ఏలాం గ్రామం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు;
[35] హారీం గ్రామం వారు మూడువందల ఇరవైమంది;
[36] యెరికో పట్టణం వారు మూడు వందల నలభై అయిదుమంది;
[37] లోదు, హదీదు, ఓనో అనే గ్రామాల వారు ఏడు వందల ఇరవై ఒకరు;
[38] సెనాయా గ్రామం వారు మూడు వేల తొమ్మిది వందల ముప్ఫయిమంది.
[39] యాజుల లెక్క: యెదాయా వంశంలో యేషూవ కుటుంబం వారు తొమ్మిది వందల డెబ్భై ముగ్గురు;
[40] ఇమ్మేరు వంశం వారు వెయ్యి యాభై ఇద్దరు;
[41] పషూరు వంశం వారు వెయ్యి రెండు వందల నలభై ఏడుమంది;
[42] హారీం వంశంవారు వెయ్యి పదిహేడు మంది.
[43] లేవీగోత్రికుల లెక్క: హోదవ్యా వంశంలో యేషూవ, కద్‌మీయేల్ అనే వారి కుటుంబాలవారు డెబ్భయి నలుగురు.
[44] గాయకుల లెక్క: ఆసాపు వంశం వారు నూట నలభై ఎనిమిది మంది.
[45] ద్వారపాలకుల లెక్క: షల్లూం, అటేరు, టల్మోను, అక్కూబ్, హటీటా, షోబయి, అనే వారి వంశీయులు నూట ముప్ఫయి ఎనిమిదిమంది.
[46] దేవాలయ సేవకులెవరంటే, జీహా, హశూపా, టబ్బాయోతు,
[47] కేరోసు, సీయహా, పాదోను,
[48] లెబానా, హగాబా, షల్మయి,
[49] హానాను, గిద్దేల్, గహారు,
[50] రెవాయ, రెజీను, నెకోదా,
[51] గజ్జాం, ఉజ్జా, పాసెయ,
[52] లెసాయి, మెహూనీం, నెపూషేసీం,
[53] బక్‌బూకు, హకూపా, హర్‌హర్,
[54] బజ్‌లీతు, మెహీదా, హర్షా,
[55] బర్కోసు, సీసెరా, తెమహు,
[56] నెజీయహు, హటీపా అనేవారి వంశాలవారు.
[57] సొలొమోను సేవకుల వంశాలవారెవరంటే, సొటయి, సొపెరెతు, పెరూదా,
[58] యెహలా, దర్కోను, గిద్దేల్,
[59] షెఫట్యా, హట్టీల్, పొకెరెత్ హజెబాయీం, ఆమోను అనేవారి వంశీయులు.
[60] దేవాలయ సేవకులూ సొలొమోను సేవకుల వంశంవారూ అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు.
[61] తేల్‌మెలహు, తేల్‌షర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే స్థలాలకు చెందినవారు కొంతమంది వచ్చారు. కాని, వారు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నాయో లేవో నిదర్శనాలు ఇవ్వలేకపోయారు.
[62] వారెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెకోదా అనే వారి వంశంవారు. వారు ఆరు వందల నలభై ఇద్దరు.
[63] అలాంటి వారు యాజులలో కూడా కొంతమంది ఉన్నారు. వారు హబాయ్యా, హాక్కోజు, బర్‌జిల్లయి అనే వారి వంశీయులు. (బర్‌జిల్లయి గిలాదువాడైన బర్‌జిల్లయి కూతుళ్ళలో ఒకతెను పెండ్లి చేసుకొన్నాడు, గనుక ఆ పేరు అతనికి వచ్చింది.)
[64] వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లను వెదికారు గాని, అవి కనబడలేదు. అందుచేత వారు అపవిత్రులుగా ఎంచబడి యాజులలో చేరలేకపోయారు.
[65] “ఊరీం”, “తుమ్మీం” ధరించగల యాజి నియమించబడేవరకు దేవునికి ప్రతిష్ఠితమైన భోజన పదార్థాలను వారు తినకూడదని ప్రజల అధికారి ఆదేశించాడు.
[66] సమకూడిన ఆ ప్రజల లెక్క మొత్తం నలభై రెండు వేల మూడు వందల అరవైమంది.
[67] వారు గాక వారి పరిచారకులు, పరిచారికలు ఏడు వేల మూడు వందల ముప్ఫయి ఏడుమంది. రెండు వందల నలభై అయిదుమంది గాయనీగాయకులు కూడా ఉన్నారు.
[68] ప్రజల గుర్రాలు ఏడు వందల ముప్ఫయి ఆరు, కంచరగాడిదలు రెండు వందల నలభై అయిదు,
[69] ఒంటెలు నాలుగు వందల ముప్ఫయి అయిదు, గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై.
[70] వంశాల నాయకులలో కొంతమంది పనికి ఆర్థిక సహాయం చేశారు. అధిపతి, ఖజానాలోకి నూట ఇరవై తులాల బంగారం, యాభై పళ్ళేలు, యాజుల కోసం అయిదు వందల ముప్ఫయి వస్త్రాలు ఇచ్చాడు.
[71] వంశాల నాయకులలో మరి కొంతమంది పనికోసం ఖజానాలోకి రెండు వేల నాలుగు వందల తులాల బంగారం, పద్నాలుగు లక్షల తులాల వెండి ఇచ్చారు.
[72] మిగతావారు ఇచ్చినది మొత్తం రెండు వేల నాలుగు వందల తులాల బంగారం, పన్నెండు లక్షల డెబ్భయి రెండు వేల ఏడు వందల ఇరవై తులాల వెండి, యాజులకోసం అరవై ఏడు వస్త్రాలు.
[73] తరువాత యాజులు, లేవీగోత్రికులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజలలో కొంతమంది, ఇస్రాయేల్ ప్రజలంతా తమ ఊళ్ళలో కాపురం చేశారు.