[1] మేము గోడను నిర్మిస్తూ ఉన్న సంగతి విని సన్‌బల్లట్ చాలా కోపంతో మండిపడ్డాడు. అతడు యూదులను ఎగతాళి చేస్తూ,
[2] షోమ్రోను సైన్యం ఎదుట, తన మిత్రుల ఎదుట ఇలా అన్నాడు: “దుర్బలమైన ఈ యూదులు చేస్తున్నదేమిటి? తమంతట తామే ఆ గోడను కట్టడం ముగించగలరా? బలులు అర్పిస్తారా? ఒక్క రోజులోనే ఆ పని ముగించ గలరా? కాలిపోయిన ఆ చెత్త కుప్పలలో నుంచి రాళ్ళను తీసుకొని కొత్తగా వాడుకోగలరా?”
[3] అమ్మోనువాడు టోబీయా అతడి ప్రక్కన ఉండి, “వాళ్ళు కట్టినదానిమీదికి నక్క దూకితే వాళ్ళ రాతిగోడ కూలిపోతుంది” అన్నాడు.
[4] మా దేవా, విను! మేము తృణీకారానికి గురి అయ్యాం. వాళ్ళ తిట్లు వాళ్ళ నెత్తిమీదికి వచ్చేలా చెయ్యి. వాళ్ళను దోపిడీగా చేసి బందీలుగా దేశాంతరం వెళ్ళేలా చెయ్యి.
[5] గోడను కట్టేవారికి వాళ్ళు విసుగు పుట్టించారు, గనుక వాళ్ళ అపరాధాన్ని కప్పివేయవద్దు, నీ దృష్టిలో నుంచి వాళ్ళ పాపాలను తుడిచివేయవద్దు.
[6] పని చేసే మనసు ప్రజలకు ఉండడంచేత గోడ సగం ఎత్తు అయ్యేవరకు మేము కట్టాం.
[7] అయితే జెరుసలం గోడల మరమ్మత్తు ముందుకు సాగుతూ ఉందనీ బీటలన్నీ మూసివేయబడుతూ ఉన్నాయనీ విని సన్‌బల్లట్, టోబీయా, అరబ్బులు, అమ్మోనువాళ్ళు, అష్డోద్ ఊరి వాళ్ళు చాలా కోపగించారు.
[8] జెరుసలం మీదికి యుద్ధానికి వచ్చి కలత కలిగించాలని వాళ్ళు ఏకగ్రీవంగా కుట్ర పన్నారు.
[9] కాని, మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ భయంచేత రాత్రింబగళ్ళు కాపలాదారులను ఉంచాం.
[10] ఈ విధంగా జరుగుతూ ఉంటే యూదావారు “బరువులు మోసేవారి బలం తగ్గిపోయింది. శిథిలాలు చాలా ఎక్కువ. గోడ కట్టలేం” అన్నారు.
[11] మా శత్రువులు “వాళ్ళకు తెలియకుండా, కనబడకుండా మనం వాళ్ళమధ్యకు చొరబడి, వాళ్ళను చంపి, పని అంతమొందిద్దాం” అన్నారు.
[12] మా శత్రువుల దగ్గర కాపురముంటున్న యూదులు వచ్చి, “అన్ని దిక్కులనుంచి వాళ్ళు మనపై బడతారు” అని అనేక సార్లు మమ్మల్ని హెచ్చరించారు.
[13] అందుచేత గోడకు పగులు ఉన్న స్థలాలలో తక్కువ ఎత్తు ఉన్న స్థలాలలో గోడవెనుక మనుషులను, వారి వంశాలప్రకారం నేను ఉంచాను. వారి చేతులలో ఈటెలూ కత్తులూ విండ్లూ ఉన్నాయి.
[14] నేను తనిఖీ చేసినతరువాత నాయకుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల ఎదుట నిలబడి ఇలా అన్నాను: “వాళ్ళకు మీరు భయపడకండి. ప్రభువు అత్యంత ప్రభావం గలవాడు, బీకరుడు. ఆయనను మనసులో ఉంచుకొని మీ తోబుట్టువులు, మీ కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, ఇండ్లు శత్రువశం కాకుండా పోరాడండి.”
[15] వాళ్ళ కుట్ర విషయం మాకు తెలియవచ్చిందనీ దేవుడు దానిని వమ్ము చేశాడనీ మా శత్రువులు వార్తలు విన్నప్పుడు, మేమంతా, ఎవరి పనికి వారు, గోడదగ్గరికి వెళ్ళాం.
[16] అయితే ఆ రోజునుంచి నా పనివారిలో సగంమంది పని చేశారు, సగంమంది ఈటెలనూ, డాళ్ళనూ, విండ్లనూ, కవచాలనూ ధరించి నిలబడ్డారు. గోడ కట్టే యూదా ప్రజలందరి వెనుక అధికారులు నిలుచున్నారు.
[17] బరువులు మోసేవారు ఒక చేతితో పని చేస్తూ, మరో చేతితో ఆయుధం పట్టుకొన్నారు.
[18] గోడ కట్టేవారిలో ఒక్కొక్కరూ తన కత్తి నడుముకు కట్టుకొని పనిచేస్తూ వచ్చారు. బూర ఊదేవాడు నా దగ్గర నిలుచున్నాడు.
[19] నేను నాయకులతో, అధికారులతో, మిగిలిన ప్రజలతో ఇలా అన్నాను: “పని గొప్పది, విస్తరించి ఉంది. మనం గోడమీద ఒకరొకరికి చాలా ఎడంగా ఉన్నాం.
[20] కనుక ఎక్కడ నుంచి మీకు బూరధ్వని వినబడుతుందో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”
[21] ఆ విధంగా మేము పని చేస్తూవచ్చాం. ఉదయంనుంచి నక్షత్రాలు కనిపించేవరకు సగంమంది ఈటెలు చేతపట్టుకొని ఉన్నారు.
[22] ఆ కాలంలో నేను ప్రజలతో “ప్రతి ఒక్కరూ తన పనివాడితో కూడా జెరుసలంలోనే ఉండిపోవాలి. అప్పుడు వారు రాత్రివేళ మనకు కాపలాదారులుగా, పగలు పనివారుగా ఉండగలరు” అన్నాను.
[23] ఆ కాలంలో నేను గానీ నా బంధువులు గానీ నా పనివారు గానీ నా దగ్గర ఉన్న కాపలాదారులు గానీ బట్టలు తీసివేయలేదు. నీళ్ళకోసం పోతే కూడా మా ఆయుధాలు చేతపట్టుకొని ఉన్నాం.