Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:04

[1] నేను చెప్పేదేమిటంటే, వారసునికి ఆస్తి అంతా చెందినా అతడు పసితనంలో ఉన్నంత కాలమూ ఈ విషయంలో అతనికీ దాసునికీ భేదమేమీ లేదు.

[2] అంటే, తండ్రి నిర్ణయించే రోజువరకు అతడు సంరక్షకుల క్రింద, ఆస్తి నిర్వాహకుల క్రింద ఉంటాడు.

[3] మన సంగతి కూడా అంతే. మనం పసితనంలో ఉన్నప్పుడు లోకం ప్రాథమిక విషయాల క్రింద దాస్యంలో ఉన్నాం.

[4] అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు,

[5] ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారిని విమోచించాలని – మనం దత్త పుత్రులమయ్యేలా – ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.

[6] మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో “తండ్రీ! తండ్రీ!” అని పిలుస్తున్నాడు.

[7] కాబట్టి నీవింకా దాసుడివి కావు, కుమారుడివి. కుమారుడివైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా.

[8] కాని, ఆ కాలంలో, మీరు దేవుణ్ణి ఎరగకముందు, ప్రకృతిసిద్ధంగా వాస్తవం కాని దేవుళ్ళకు బానిసత్వంలో ఉన్నారు.

[9] ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగినవారు – మరి విశేషంగా దేవుడు మిమ్ములను ఎరిగినవాడు. ఇలాంటప్పుడు దుర్బలమైన, వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు మళ్ళీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మళ్ళీ తిరుగుతున్నారు ఎందుకని?

[10] మీరు దినాలు, నెలలు, మహోత్సవ కాలాలు, సంవత్సరాలు పాటిస్తారు.

[11] మీ విషయంలో నేను పడ్డ కష్టాలు ఒకవేళ వ్యర్థమై పోతాయేమో అని మీ గురించి నాకు భయం వేస్తూ ఉంది.

[12] సోదరులారా, నేను మీలాంటివాణ్ణయ్యాను గనుక మీరు నాలాంటివారు కావాలని మిమ్ములను వేడుకొంటున్నాను. మీరు నాకు కీడేమీ చేయలేదు.

[13] మొదటి సారి నేను మీకు శారీరక బలహీనత ద్వారా శుభవార్త ప్రకటించానని మీకు తెలుసు.

[14] నా శరీరంలో నాకు విషమ పరీక్షగా ఉన్నదాన్ని మీరు చిన్నచూపు చూడలేదు, తృణీకరించలేదు గాని దేవదూతనూ క్రీస్తు యేసునూ స్వీకరించే ప్రకారం నన్ను స్వీకరించారు.

[15] అప్పుడు మీకున్న దీవెన ఏది? సాధ్యమైతే మీ కండ్లు ఊడబెరికి నాకిచ్చి ఉండేవారేనని మీ గురించి సాక్ష్యం చెపుతున్నాను.

[16] మీతో సత్యం చెప్పడంవల్ల నేను మీకు విరోధినయ్యానా ఏమిటి?

[17] వారికి మీరంటే ప్రత్యేక శ్రద్ధే గాని వారి ఉద్దేశం మంచిది కాదు. మీకే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగేలా మిమ్ములను మా నుంచి వేరు చేయాలని కోరుతున్నారు.

[18] ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే – నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు.

[19] నా చిన్న పిల్లలారా! క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయంలో మళ్ళీ ప్రసవ వేదనలు పడుతూ ఉన్నాను!

[20] మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది. నేనిప్పుడు మీతో ఉండి మరో విధంగా మాట్లాడాలని నా కోరిక.

[21] ధర్మశాస్త్రం క్రింద ఉండగోరే వారలారా, ధర్మశాస్త్రం చెప్పేది మీరు వినడం లేదా, చెప్పండి?

[22] ఇలా రాసి ఉంది గదా: అబ్రాహాముకు ఇద్దరు కొడుకులు – బానిసవల్ల ఒకడు, స్వతంత్రురాలివల్ల మరొకడు.

[23] గాని బానిస కొడుకు శరీర రీతిగా పుట్టాడు, స్వతంత్రురాలి కొడుకు దేవుని వాగ్దానం ఫలితంగా పుట్టాడు.

[24] ఈ విషయంలో అలంకారిక సాదృశ్యం ఉంది. ఎలాగంటే, ఆ ఇద్దరు స్త్రీలూ రెండు ఒడంబడికలు. ఒకటి సీనాయి పర్వతం నుంచి వచ్చి దాస్యానికి పిల్లలను కలిగిస్తుంది. ఇది హాగరు.

[25] ఈ హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతం. అది ఇప్పటి జెరుసలంకు గుర్తుగా ఉంది. ఎందుకంటే జెరుసలం తన పిల్లలతోపాటు దాస్యంలో ఉంది.

[26] అయితే పైనున్న జెరుసలం స్వతంత్రంగా ఉంది. అదే మనకందరికీ తల్లి.

[27] గొడ్రాలా! పిల్లలను కననిదానా! ఆనందించు! ప్రసవ వేదన పడనిదానా! బిగ్గరగా కేకలు పెట్టు! ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే ఒంటరిగా ఉన్నదాని పిల్లలే ఎక్కువ అని రాసి ఉంది గదా.

[28] సోదరులారా, మనం ఇస్సాకులాగే వాగ్దాన సంతానం.

[29] ఆ కాలంలో శరీరరీతిగా పుట్టినవాడు దేవుని ఆత్మ ప్రకారం పుట్టినవాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది.

[30] అయితే లేఖనం ఏమంటుంది? – బానిసనూ దాని కొడుకునూ వెళ్ళగొట్టు! ఎందుకంటే బానిస కొడుకు స్వతంత్రురాలి కొడుకుతోపాటు వారసుడు కాబోడు!

[31] కాబట్టి, సోదరులారా, మనం బానిస సంతానం కాము గాని స్వతంత్రురాలి సంతానమే.

గలతీయవారికి లేఖ — Chapters