Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:24

[1] క్రీస్తు మనలను దాస్యంలో నుంచి విడిపించాడు. ఆ విడుదలలో సుస్థిరంగా నిలిచి ఉండండి, దాస్యం కాడికి మళ్ళీ లొంగిపోకండి.

[2] చూడండి, నేను – పౌలునే – మీకీ మాట చెపుతున్నాను – మీరు సున్నతి పొందితే క్రీస్తువల్ల మీకు ప్రయోజనమేమీ ఉండదు.

[3] సున్నతి పొందిన ప్రతి మనిషికీ నేను మరో సారి నొక్కి చెప్పేది ఏమిటంటే, అలాంటివాడు ధర్మశాస్త్రం అంతటిని పాటించడానికి బద్ధుడు.

[4] మీలో ధర్మశాస్త్రంవల్ల నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తున్నవారు క్రీస్తు చైతన్యం నుంచి దూరమైపోయారు, కృప మార్గం నుంచి పతనమయ్యారు.

[5] ఎందుకంటే, మనం విశ్వాసం మూలమైన నీతిన్యాయాల గురించిన ఆశాభావం నెరవేర్పు కోసం దేవుని ఆత్మ ద్వారా ఆతురతతో ఎదురు చూస్తున్నాం.

[6] క్రీస్తు యేసులో సున్నతి గాని సున్నతి లేనితనం గానీ ఏమీ సాధించదు. ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.

[7] మునుపు మీరు బాగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. సత్యాన్ని పెడచెవిని పెట్టేలా మిమ్ములను అడ్డగించినదెవరు?

[8] ఆ విధంగా చేయడానికి ఒప్పించినది మిమ్ములను పిలుస్తున్న దేవుడు కాదు.

[9] పొంగజేసే పదార్థం కొంచెమైనా పిండి ముద్దనంతా పొంగజేస్తుంది.

[10] మీరు వేరే అభిప్రాయం కలిగి ఉండరని మీ విషయం ప్రభువులో నాకు నమ్మకం ఉంది. మీకు కలవరం కలిగించేవాడు – అతడెవడైనా సరే – శిక్ష భరించవలసివస్తుంది.

[11] సోదరులారా, సున్నతి పొందాలని ఒకవేళ నేనింకా ప్రకటిస్తూ ఉంటే నేనెందుకు ఇంకా హింసలకు గురి అవుతూ ఉన్నాను? ఆ పక్షంలో సిలువను గురించిన తొట్రుపాటు కారణం లేకుండా పోతుంది.

[12] మిమ్ములను కలవరపెట్టేవారు అంగచ్ఛేదం చేసుకోవాలని కోరి ఉండేవాణ్ణి.

[13] సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి. దానికి బదులు ప్రేమభావంతో ఒకరికొకరు సేవ చేయండి.

[14] ధర్మశాస్త్రమంతా ఒకే ఒక మాటలో ఇమిడి ఉంది. ఏమిటంటే, “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.”

[15] గానీ మీరు ఒకరినొకరు కరచుకొంటూ దిగమింగివేస్తూ ఉంటే ఒకరివల్ల ఒకరు పూర్తిగా ధ్వంసమైపోతారేమో జాగ్రత్త!

[16] నేను చెప్పేదేమంటే, దేవుని ఆత్మకు లోబడి నడుచుకోండి. అప్పుడు శరీర స్వభావం కోరేవాటిని చేయరు.

[17] శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి – పరస్పర వైరం ఉంది, గనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు.

[18] గానీ దేవుని ఆత్మ మిమ్ములను నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు.

[19] శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం,

[20] విగ్రహపూజ, మంత్ర ప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్యాభావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు,

[21] అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులు మొదలయినవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్ళీ ముందుగా చెపుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు.

[22] దేవుని ఆత్మ ఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత,

[23] సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటివాటికి వ్యతిరేకమైన నియమమేమీ లేదు.

[24] క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితోకూడా దాని కోరికలనూ ఇచ్ఛలనూ సిలువ వేశారు.

[25] దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి నడుచుకొందాం.

[26] వట్టి డాంబికులం కాకుండా, ఒకరికొకరం కోపం రేపకుండా ఒకరిమీద ఒకరం అసూయపడకుండా ఉందాం.

గలతీయవారికి లేఖ — Chapters