[1] ఓ తెలివితక్కువ గలతీయవారలారా! మీరు సత్యానికి లోబడకుండా మిమ్ములను భ్రమపెట్టినదెవరు? సిలువకు గురి అయినట్టే యేసు క్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది గదా!
[2] ఈ ఒకే విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకుంది. మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర క్రియలచేతా? విశ్వాసంతో శుభవార్త వినడంవల్లా?
[3] మీరింత తెలివితక్కువవారా? దేవుని ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీర స్వభావంవల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా?
[4] మీరిన్ని బాధలుపడింది వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమవుతుందా?
[5] మీకు తన ఆత్మను ప్రసాదించి మీ మధ్య అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి అలా చేస్తున్నాడా? లేక మీరు విశ్వాసంతో వినడం బట్టేనా?
[6] దీనికి అనుగుణంగా అబ్రాహాము “దేవునిమీద నమ్మకం ఉంచాడు. అతనికి ఆ నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.”
[7] అందుచేత, విశ్వాస సంబంధులే అబ్రాహాము సంతానమని తెలుసుకోండి.
[8] దేవుడు ఇతర జనాలను విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచుతాడని దూరదృష్టితో లేఖనం ముందుగానే అబ్రాహాముకు “నీ మూలంగా జనాలన్నీ ధన్యమవుతాయి” అని శుభవార్త ప్రకటించింది.
[9] అలాగే విశ్వాస సంబంధులే విశ్వాసముంచిన అబ్రాహాముతోకూడా ధన్యులు.
[10] ధర్మశాస్త్రం విధించే క్రియల సంబంధులంతా శాపం క్రింద ఉన్నారు. ఎందుకంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నవన్నీ చేస్తూ ఉండని ప్రతి ఒక్కరూ శాపగ్రస్థులని రాసి ఉంది.
[11] ధర్మశాస్త్రంవల్ల దేవుని లెక్కలో ఎవరూ నిర్దోషి కారని తేటతెల్లమే. ఎందుకంటే, “నిర్దోషి దేవునిమీది నమ్మకంవల్లే జీవిస్తాడు.”
[12] ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని చట్టాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటివల్ల బ్రతుకుతాడు అని రాసి ఉంది.
[13] ధర్మశాస్త్రం వల్ల అయిన శాపంనుంచి క్రీస్తు మనలను విమోచించాడు. ఎలాగంటే ఆయన మనకోసం శాపగ్రస్థుడయ్యాడు – “మ్రానుమీద వ్రేలాడే ప్రతి వాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
[14] దానివల్ల, అబ్రాహాముకు ఇచ్చిన దీవెన క్రీస్తు యేసులో ఇతర జనాలకు రావాలనీ దేవుని ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసంద్వారా మనం పొందాలని ఆయన ఉద్దేశం.
[15] సోదరులారా, లోక వ్యవహారం ప్రకారం మాట్లాడుతున్నాను – మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి మరేమీ చేర్చరు.
[16] వాగ్దానాలు చేసినది అబ్రాహాముకూ అతని సంతానానికీ. దేవుడు అనేకులను ఉద్దేశించి అన్నట్టు “సంతానాలకు” అనలేదు గాని ఒకణ్ణే అన్నట్టు “సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తు.
[17] నేను చెప్పేదేమిటంటే, ముందుగా దేవుడు క్రీస్తులో స్థిరపరచిన ఒడంబడికను నాలుగు వందల ముప్ఫయి ఏళ్ళయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయదు, దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు.
[18] ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రంవల్ల అయినదంటే ఇక అది వాగ్దానం వల్ల అయ్యేది కాదన్న మాటే. అయితే దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం మూలంగానే అబ్రాహాముకిచ్చాడు.
[19] అలాగైతే ధర్మశాస్త్రమెందుకని? అది అతిక్రమాలను బట్టి కలుపబడింది. ఆ వాగ్దానం ఏ సంతానానికి చేయబడిందో ఆయన వచ్చేంతవరకే ధర్మశాస్త్రం అమల్లో ఉంది. అది దేవదూతల ద్వారా మధ్యవర్తిచేత నియమించబడింది.
[20] మధ్యవర్తి ఒక్కరికోసమే ఉండడు గాని దేవుడు ఒక్కడే.
[21] ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ బ్రతికించగల ధర్మశాస్త్రం అనుగ్రహించడం వీలుండి ఉంటే వాస్తవంగా నిర్దోషత్వం ధర్మశాస్త్రంవల్లే కలిగి ఉండేవి.
[22] కానీ యేసు క్రీస్తు మీది విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం క్రింద మూసివేసింది.
[23] అయితే విశ్వాసం రాకముందు మనం ధర్మశాస్త్రం క్రింద ఖైదీలుగా ఉంచబడ్డాం, తరువాత వెల్లడి అయ్యే విశ్వాసం కోసం అలా ఉంచబడ్డాం.
[24] కాబట్టి ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడిలాంటిదై ఉండేది. మనం నమ్మకంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా మనలను క్రీస్తుదగ్గరకు నడిపించడమే దాని పని.
[25] అయితే విశ్వాసం వచ్చిన తరువాత మనం ఇక బాలశిక్షకుడి క్రింద లేము.
[26] ఎందుకంటే, క్రీస్తు యేసు మీది నమ్మకం ద్వారా మీరంతా దేవుని కుమారులు.
[27] క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొన్నారు.
[28] ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, బానిస అని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు – క్రీస్తు యేసులో మీరందరూ ఒక్కటిగా ఉన్నారు.
[29] మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానం, వాగ్దానం ప్రకారమైన వారసులు.