Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:08

[1] పిల్లలారా! ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది న్యాయం.

[2] “మీకు క్షేమం కలిగేలా, భూమిమీద ఎక్కువ కాలం బ్రతికేలా

[3] తండ్రినీ తల్లినీ సన్మానించాలి” – వాగ్దానంతో వచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే.

[4] తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభువు గురించిన ఉపదేశంతో, క్రమశిక్షణతో వారిని పెంచండి.

[5] దాసులారా, క్రీస్తుపట్ల విధేయత చూపినట్టే శరీరరీతిగా మీ యజమానులపట్ల కపటం లేని హృదయంతో, భయంతో, వణకుతో విధేయత చూపండి.

[6] మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుట మాత్రమే కాక, క్రీస్తు దాసులై ఉన్న ప్రకారం దేవుని చిత్తాన్ని హృదయపూర్తిగా జరిగించండి.

[7] మీ సేవ మనుషులకు చేసినట్టు కాక, ప్రభువుకు చేసినట్టే మంచి మనసుతో చేయండి.

[8] బానిసలయినా, స్వతంత్రులైనా ప్రతి ఒక్కరూ చేసిన మంచికి ప్రభువువల్ల ప్రతిఫలం పొందుతారని మీకు తెలుసు.

[9] యజమానులారా, మీరు కూడా మీ దాసులపట్ల అలాగే వ్వవహరించండి. వారిని బెదిరించడం మానండి. మీకు యజమాని ఒకడు పరలోకంలో ఉన్నాడనీ ఆయనకు పక్షపాతమేమీ లేదనీ మీకు తెలుసు.

[10] తుదకు, నా సోదరులారా, ప్రభువులో ఆయన సమర్థత బలప్రభావాలచేత బలాఢ్యులై ఉండండి.

[11] అపనింద పిశాచం కుతంత్రాలను ఎదిరిస్తూ గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుడిచ్చే కవచమంతా ధరించుకోండి.

[12] ఎందుకంటే, మనం పోరాడుతున్నది రక్త మాంసాలున్నవారితో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ఈ యుగ అంధకారాన్ని ఏలుతున్న నాథులతో, పరమ స్థలాలలో ఉన్న ఆత్మ రూపులైన దుష్టశక్తుల సేనలతో.

[13] అందుచేత మీరు దుర్దినంలో వారిని ఎదిరిస్తూ, చేయవలసినదంతా సాధించి గట్టిగా నిలబడి ఉండగలిగేలా దేవుని కవచమంతా ధరించుకోండి.

[14] కనుక స్థిరంగా నిలబడి ఉండండి! మీ నడుముకు సత్యాన్ని దట్టిగా కట్టుకోండి. నీతిన్యాయాలను కవచంగా ఛాతికి ధరించుకోండి.

[15] మీ పాదాలకు శాంతి శుభవార్త సంసిద్ధత అనే జోడు తొడుక్కోండి.

[16] అన్నిటికి పైగా విశ్వాసం డాలు చేతపట్టుకోండి. దానితో ఆ దుర్మార్గుడు ప్రయోగించే అగ్ని బాణాలన్ని ఆర్పివేయగలుగుతారు.

[17] పాపవిముక్తి శిరస్త్రాణం ధరించుకోండి. దేవుని ఆత్మ ఖడ్గం చేతపట్టుకోండి – అది దేవుని వాక్కే.

[18] అన్ని విధాల ప్రార్థనలతో, విన్నపాలతో అన్ని సమయాలలో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి. ఇందుకు జాగరూకత కలిగి పూర్తి పట్టుదలతో పవిత్రులందరికోసం విన్నపాలు చేస్తూ ఉండండి.

[19] అలాగే నాకోసం కూడా ప్రార్థించండి. నేను శుభవార్త రహస్య సత్యాన్ని ధైర్యంగా తెలియజేయడానికి నోరు తెరిచేలా, నాకు మాటలు లభించేలా,

[20] అందులో నేను ప్రకటించవలసిన విధంగా ధైర్యంతో ప్రకటించేలా ప్రార్థించండి. శుభవార్త కోసం నేను సంకెళ్ళపాలయిన ప్రతినిధిని.

[21] నా పరిస్థితులు, నేను చేసేది మీరు కూడా తెలుసుకొనేలా ప్రియ సోదరుడు తుకికస్ అంతా మీకు తెలియజేస్తాడు. అతడు ప్రభువులో నమ్మకమైన సేవకుడు.

[22] మా విషయాలు మీరు తెలుసుకోవాలనీ, అతడు మీ హృదయాలను ఓదార్చాలనీ అతణ్ణి ఈ ఉద్దేశాన్ని బట్టే మీ దగ్గరకి పంపుతున్నాను.

[23] తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తునుంచీ సోదరులకు నమ్మకంతో కూడా ప్రేమ, శాంతి కలుగుతాయి గాక!

[24] మన ప్రభువైన యేసు క్రీస్తు మీద అమర ప్రేమ ఉన్నవారందరికీ కృప తోడైవుంటుంది గాక! తథాస్తు.

ఎఫెసువారికి లేఖ — Chapters