[1] అందుచేత దేవుని ప్రియమైన పిల్లలుగా తగినట్టు ఆయనను అనుసరించి నడుచుకొంటూ ఉండండి.
[2] క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, బలిగా తనను అప్పగించుకొన్నాడు. అలాగే మీరూ ప్రేమభావంతో ప్రవర్తిస్తూ ఉండండి.
[3] కానీ పవిత్రులకు తగినట్టుగా నడుస్తూ వ్యభిచారం, కల్మషమంతా, అత్యాశ - వీటిని సూచించే మాటలు సహా మీ మధ్య ఎవరూ ఎత్తకూడదు.
[4] అంతేగాక, బూతులు, పనికిమాలిన మాటలు, సరససల్లాపాలు మీరు పలకకూడదు. అలాంటివి తగవు. వాటికి బదులు కృతజ్ఞతలు చెపుతూ ఉండాలి.
[5] ఈ విషయం మీకు బాగా తెలుసు – ఏ వ్యభిచారి గానీ కల్మషుడు గానీ అత్యాశపరుడు (అతడు విగ్రహ పూజకుడు) గానీ దేవునికీ క్రీస్తుకూ చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండడు.
[6] వట్టి మాటలతో ఎవరూ మిమ్ములను మోసగించనియ్యకండి. అలాంటి అపరాధాల కారణంగా దేవుని కోపం అవిధేయులమీదికి వస్తుంది.
[7] గనుక అలాంటివారితో పాలివారు కాకండి.
[8] మునుపు మీరు చీకటి, ఇప్పుడైతే ప్రభువులో మీరు వెలుగు.
[9] దేవుని ఆత్మ ఫలం అన్ని రకాల మంచితనం, నీతినిజాయితీలు, సత్యం.
[10] ప్రభువుకు ఏవి ఆనందకరమైనవో అవి కనుగొని వెలుగు సంతానానికి తగినట్టు నడుచుకొంటూ ఉండండి.
[11] వ్యర్థమైన చీకటి వ్యవహారాలలో పాల్గొనకండి. దానికి బదులు వాటిని ఖండించండి.
[12] వారు గుట్టుగా చేసే పనులను గురించి మాట్లాడడం కూడా సిగ్గుచేటు.
[13] వెలుగువల్ల వెల్లడి అయినవన్నీ గోచరమవుతాయి, గోచరమయ్యేలా చేసేది వెలుగే.
[14] అందుచేత ఆయన “నిద్రబోతూ! మేల్కో! మృతి చెందినవారిలోనుంచి లే! క్రీస్తు నీమీద ప్రకాశిస్తాడు” అంటాడు.
[15] ఈ రోజులు చెడ్డవి, గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఉండండి.
[16] తెలివితక్కువ వారిలాగా కాక, తెలివైనవారిలాగే నడుచుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.
[17] బుద్ధిహీనులు కాకండి! ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
[18] మద్యంతో మత్తిల్లకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉండండి.
[19] అలాగే కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి. పాడుతూ మీ హృదయాలలో ప్రభువుకు గానం చేయండి.
[20] మన ప్రభువైన యేసు క్రీస్తు పేర తండ్రి అయిన దేవునికి అన్నిటి కోసం ఎప్పుడూ కృతజ్ఞతలు చెపుతూ ఉండండి.
[21] దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉండండి.
[22] పెళ్ళి అయిన స్త్రీలారా, ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి.
[23] క్రీస్తు సంఘానికి శిరస్సు, శరీరానికి రక్షకుడు. అలాగే భర్త భార్యకు శిరస్సు.
[24] గనుక తన సంఘం క్రీస్తుకు లోబడినట్టు భార్యలు తమ భర్తలకు అన్ని విషయాలలో లోబడివుండాలి.
[25] పెండ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి.
[26] దేవుని వాక్కు అనే నీళ్ళతో స్నానం ద్వారా దాన్ని శుద్ధి చేసి పవిత్రపరచేందుకు క్రీస్తు దానికోసం తనను అర్పించుకొన్నాడు.
[27] సంఘం పవిత్రంగా, నిర్దోషంగా ఉండాలనీ మచ్చ, మడత, అలాంటి మరేదీ లేకుండా దివ్యమైనదిగా దానిని తనముందు నిలబెట్టుకోవాలనీ ఆయన అలా చేశాడు.
[28] అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాలనులాగే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నవాడు తనను ప్రేమించుకొంటున్నాడన్నమాట.
[29] సొంత శరీరాన్ని ద్వేషించుకొనేవాడెవడూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొంటాడు. ప్రభువు తన సంఘాన్ని అలాగే చూచుకొంటాడు.
[30] ఎందుకంటే మనం ఆయన మాంసం, ఎముకలలో ఆయన శరీరంలోని భాగాలం.
[31] “అందుచేత మనిషి తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను అంటిపెట్టుకొంటాడు. వారిద్దరూ ఒకే శరీరమవుతారు.”
[32] ఈ రహస్య సత్యం గొప్పది. అయితే నేను క్రీస్తునూ సంఘాన్నీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను.
[33] అయినా మీలో ప్రతివాడూ తనలాగే తన భార్యను ప్రేమించాలి. భార్య భర్తను గౌరవించాలి.