[1] మీకు అందిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడు తున్నాను.
[2] పూర్ణ వినయంతో సాత్వికంతో ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమభావంతో ఒకరిపట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి.
[3] దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి.
[4] క్రీస్తు శరీరం ఒక్కటే. దేవుని ఆత్మ ఒక్కడే. మీకందిన పిలుపు గురించిన ఆశాభావం కూడా ఒక్కటే.
[5] ఒక్కడే ప్రభువు. ఒక్కటే విశ్వాసం. ఒక్కటే బాప్తిసం.
[6] అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే అందరికీ పైగా, అందరి ద్వారాను, మీలో ప్రతి వ్యక్తిలో ఉన్నాడు.
[7] అయితే మనలో ప్రతి ఒక్కరికీ క్రీస్తు కొలిచి ఇచ్చిన వరం ప్రకారం కృప ఇవ్వబడింది.
[8] అందుచేత ఆయన లేఖనంలో ఇలా చెపుతున్నాడు: ఆయన ఆరోహణం అయినప్పుడు ఖైదీలను ఊరేగింపులో తీసుకువెళ్ళాడు. మనుషులకు ఈవులిచ్చాడు.
[9] “ఆరోహణమయ్యాడు” అంటే మొదట ఆయన భూమి క్రింది భాగాలలోకి దిగాడని అర్థమిస్తుంది గదా.
[10] క్రిందికి దిగినవాడే సర్వాన్ని నింపేలా ఆకాశాలన్నిటికంటే ఎంతో పైకి ఎక్కిపోయాడు.
[11] ఆయన తన రాయబారులుగా కొందరినీ, ప్రవక్తలను కొందరినీ, శుభవార్త ప్రచారకులను కొందరినీ, సంఘ కాపరులూ ఉపదేశకులూ అయిన కొందరినీ సంఘానికి ఇచ్చాడు.
[12] ఎందుకంటే, పవిత్రులు సేవ చేసేందుకు సమర్థులు కావాలనీ క్రీస్తు శరీరం పెంపొందాలనీ ఆయన ఉద్దేశం.
[13] మనమందరమూ నమ్మకంలో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంతో ఏకీభావం పొంది, సంపూర్ణ వృద్ధికి వచ్చేవరకూ – క్రీస్తు సంపూర్ణత ఉన్నతి పరిమాణం అందుకొనేవరకూ ఇలా జరుగుతూ ఉండాలని ఆయన ఉద్దేశం.
[14] మనం ఇకనుంచి పసి పిల్లల్లాగా ఉండకూడదు అన్నమాట. అంటే, అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుపోయే వారిలాగా, ప్రతి మత సిద్ధాంతం గాలికీ ఎగిరిపోయేవారిలాగా మనముండకూడదు. మనుషులు కపటంచేత కుయుక్తితో కల్పించే మాయోపాయాలకు కొట్టుకుపోకూడదు.
[15] గానీ ప్రేమతో సత్యం చెపుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో పెరగాలి. ఆయనే శిరస్సు.
[16] ఆయననుంచి శరీరమంతా ప్రతి కీలూ అందించే దానిచేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అందులోని ప్రతి భాగమూ సరిగా దాని పని చేయడంవల్ల శరీరం ప్రేమలో పెంపొందుతూ వర్థిల్లుతూ ఉంటుంది.
[17] అందుచేత ఇప్పటినుంచి మిగిలిన ఇతర జనాలలాగా ప్రవర్తించకూడదని నేను ప్రభువు పేర సాక్షిగా చెపుతున్నాను.
[18] వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు. వారి మనసు చీకటిమయం. వారి హృదయాలు బండబారిపోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరైఉన్నారు.
[19] సిగ్గుమాలినవారై అత్యాశతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చివేసుకొన్నారు.
[20] అయితే మీరలా క్రీస్తును నేర్చుకోలేదు.
[21] మీరు ఆయన స్వరం విని ఆయనచేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న ప్రకారం
[22] మీ మునుపటి జీవిత విధానం విషయంలోనైతే మోసకరమైన కోరికలచేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత “మానవుణ్ణి” తొలగించాలి.
[23] మీ మనసు లక్ష్యం విషయంలో కొత్తదనం పొందాలి.
[24] దేవుని అనుగుణంగా నిజమైన నీతిన్యాయాలతో పవిత్రతతో సృజించబడ్డ కొత్త “మానవుణ్ణి” ధరించుకోవాలి.
[25] అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి. మనం ఒకరికి ఒకరం అవయవాలం, గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పుకోండి.
[26] కోపపడండి గాని అపరాధం చేయకుండా ఉండండి. మీకు రేగిన కోపం ప్రొద్దు క్రుంకే ముందే అంతరించాలి.
[27] అపనింద పిశాచానికి చోటివ్వకండి.
[28] పూర్వం దొంగతనం చేసినవారు ఇకనుంచి దొంగతనం చేయకూడదు. అతడు అక్కరలో ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టడానికి ఒక మంచి వృత్తి చేపట్టి స్వహస్తాలతో కష్టించి పని చేయాలి.
[29] చెడ్డ మాటలేవీ మీ నోటినుంచి రానివ్వకండి గాని వినేవారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి.
[30] దేవుని పవిత్రాత్మను దుఃఖపెట్టకండి. మోక్ష దినంకోసం ఆయన మీమీద ముద్ర వేశాడు.
[31] సమస్తమైన ద్వేషం, ఆగ్రహం, కోపం, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గాన్ని విసర్జించండి.
[32] ఒకరిమీద ఒకరు కరుణభావంతో దయ చూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరూ ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి.